తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి సంచలనం- సీఎస్ వద్ద పంచాయతీ: ఐపీఎస్‌పై కంప్లైంట్
కర్ణాటక క్యాడర్ కు చెందిన తెలుగు సీనియర్ ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ డీ రూప మధ్య వివాదం మరింత ముదిరింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ జోక్యం చేసుకున్నారు. వివరణ కోరారు.
బెంగళూరు: విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు పొందిన కర్ణాటక కేడర్‌కు చెందిన తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరిని వివాదాలు చుట్టు ముట్టాయి. ఇదివరకు మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో తోటి ఐఎఎస్ అధికారిణి, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్‌తో వివాదం గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు మళ్లీ వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.

తరచూ వార్తల్లో..
ఇదివరకు మైసూరు జిల్లా కలెక్టర్ గా పని చేసినప్పుడు కూడా పలు ఆరోపణలను ఎదుర్కొన్నారు రోహిణి సింధూరి. తనపై రోజూ ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీన్ని భరించలేక ఏకంగా తన సర్వీసుకే రాజీనామా చేస్తున్నట్లు 2001లో మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రోహిణి సింధూరిని బదిలీ చేయాల్సి వచ్చింది.

19 ఆరోపణలు..
ఇప్పుడు తాజాగా రోహిణి సింధూరిపై కర్ణాటక క్యాడర్ కే చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి డీ రూప.. తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా 19 రకాల ఆరోపణలతో కూడిన ఓ జాబితాను విడుదల చేశారు. ఎమ్మెల్యే సా.రా. మహేష్ తో చర్చల విషయం బహిర్గతం కావడంతో రోహిణి సింధూరిపై ఆరోపణల వర్షం కురిపించారు. రోహిణి సింధూరి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సా.రా. మహేష్ తో..
మైసూరులో సా.రా. మహేష్ భూఆక్రమణకు పాల్పడినట్లు స్వయంగా ఆయనపై ఆరోపణలు చేసిన రోహిణి సింధూరి ఇప్పుడు ఆయనను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. అలాంటి నాయకుడిని రోహిణి సింధూరి తోటి ఐఏఎస్ అధికారి మణిమన్నన్ తో వెళ్లి కలిశారని, దీనికి గల కారణాలను వెల్లడించాలని డీ రూప డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే లేదా రాజకీయ నాయకులను ఐఎఎస్ స్థాయి అధికారి కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

లక్షల రూపాయల వ్యయంతో..
బీజేపీకి చెందిన మైసూరు లోక్ సభ సభ్యుడు ప్రతాప సింహాపైనా రోహిణి సింధూరి గతంలో పలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. బెంగళూరు జాలహళ్లిలో విశాలమైన ఇంటిని రోహిణి సింధూరి కట్టుకున్నారని, స్థిరాస్తి రిటర్న్స్‌లో ఈ ఇంటి ప్రస్తావన లేదని గుర్తు చేశారు. కోట్ల విలువ రూపాయల విలువ చేసే ఇటాలియన్ ఫర్నీచర్, 26 లక్షల రూపాయల విలువ చేసే జర్మన్ ఇంటీరియర్స్ ను దీనికి వినియోగించారని అన్నారు. వీటన్నింటికీ డబ్బలు ఎక్కడివని ప్రశ్నించారు.

సీఎస్ వద్ద..
డీ రూప తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో- తాజాగా రోహిణి సింధూరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆమె సచివాలయానికి చేరుకున్నారు. నేరుగా వందితతో భేటీ అయ్యారు. డీ రూప తనపై చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. అదే సమయంలో రూపపై ఫిర్యాదు చేశారు. సివిల్ సర్వీసెస్ అధికారులు బహిరంగంగా ఎలాంటి ఆరోపణలు కూడా చేయకూడదంటూ డీఓపీటీ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు.

రూపపై చర్యలు..
రూప నగ్న ఫొటోలను తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు మరో ముగ్గురు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులకు పంపించినట్లు ఆరోపించారని, అలాంటి పని తాను చేయగలనా? అని రోహిణి సింధూరి ప్రశ్నించారు. తనపై కక్షపూరితంగా రూప వ్యవహరిస్తోన్నారని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించానని స్పష్టం చేశారు. రూపపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవాల్సిందేనని కోరినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications