"జెన్ జీని గుడ్డిగా నమ్ముతా, నిరసనల గురించి తెలీదు" ఆరెస్సెస్ ఛీఫ్ షాకింగ్ ..!
నీట్ పరీక్ష అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెన్ జీ విద్యార్ధులు ఢిల్లీలో చేపట్టిన నిరసనలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో జెన్ జీకి దగ్గరయ్యేందుకు ప్రధాని మోడీతో పాటు ఆరెస్సెస్ నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఆరెస్సెస్ అధినేత (RSS Chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఇవాళ జెన్ జీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ యువతరంపై తనకు విశ్వాసం ఉందని, తాను జెన్ జెడ్‌ను గుడ్డిగా నమ్ముతానని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ తెలిపారు. మెరుగైన వ్యవస్థ కోసం నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందన్నారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలకు కారణమైన పరిస్దితులు మాత్రం తనకు తెలియదని, కానీ యువతపై తనకున్న విశ్వాసం చెక్కుచెదరలేదని భగవత్ వెల్లడించారు. యువత నిరసనలు, ప్రజాస్వామ్య చర్చల్ని ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది సంభాషణకు ఒక సాధనమని ఆయన తెలిపారు.

గత తరాల వారు అధికారంలో ఉన్న వారిని అరుదుగా ప్రశ్నించేవారని, కానీ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరం సానుభూతితో ప్రశ్నలు అడుగుతూ, తార్కిక సమాధానాలు కోరుకుంటారని భగవత్ తెలిపారు. జెన్ జెడ్ తరం వారిని నిరసనలు చేయవద్దని తాను ఎప్పటికీ చెప్పనని భగవత్ తెలిపారు. అయితే అటువంటి భావప్రకటనకు ప్రజాస్వామ్యం సరైన మార్గాన్ని కల్పించాలని ఆయన సూచించారు. వ్యవస్థలో సరిదిద్దాల్సిన లోపాలు ఉన్నాయని, తమ గళాన్ని వినిపించడానికి, మెరుగుదల కోరడానికి విద్యార్థులకు ప్రజాస్వామ్య హక్కు ఉందన్నారు. సానుకూల మార్పును తీసుకురావడమే లక్ష్యంగా జరిగే నిరసనలను, ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి చట్టబద్ధమైన వ్యక్తీకరణగా మాత్రమే చూడాలన్నారు. యువతను, ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. మరింత కరుణ, అవగాహన అవసరమని భగవత్ తెలిపారు.




Click it and Unblock the Notifications