ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్! ఎలక్షన్ కమిషనర్ పై చర్యలకు కేబినెట్ సెక్రటరీ నో!
కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాల్లో అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంది. ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష వైఖరిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు స్వయంగా కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని గౌరవిస్తూ కేబినెట్ సచివాలయం ఈ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసినట్లు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే పేర్కొంది . సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కీలక పత్రాలు దేశవ్యాప్తంగా అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయని కథనాన్ని ప్రచురించింది.
ఐఏఎస్ అధికారి వర్క్ అలోకేషన్ వివాదం: అసలేం జరిగింది?
కేంద్ర ఎన్నికల సంఘంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి మనీష్ గార్గ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ వివాదానికి మూలకారణంగా మారాయి. కమిషన్ పరిధిలోని సీనియర్ డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, డైరెక్టర్ జనరల్స్ వంటి ఉన్నతాధికారుల శాఖల కేటాయింపులను ఆయన ఏకపక్షంగా పునర్వ్యవస్థీకరించారని ఆరోపణలు వచ్చాయి. ముందస్తు అనుమతి లేకుండా, కనీసం చర్చించకుండా బాధ్యతలను మార్చేయడంపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాల సవరణలు, పేర్ల తొలగింపు వంటి సున్నితమైన అధికారాలు ఒకే చోట కేంద్రీకృతమయ్యేలా ఈ మార్పులు ఉన్నాయని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేబినెట్ సెక్రటరీకి లేఖలు.. సచివాలయం స్పష్టమైన సమాధానం
ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి చెంది, రాతపూర్వక హెచ్చరికలను సైతం లెక్కచేయలేదని పేర్కొంటూ కమిషనర్లు సంధూ, వివేక్ జోషి జూలై 29న కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు విడివిడిగా లేఖలు రాశారు. ఈ అంశంపై విచారణ జరిపిన కేబినెట్ సచివాలయం మాత్రం కీలక స్పష్టత ఇచ్చింది. సదరు లేఖలు కమిషనర్లు తమ వ్యక్తిగత హోదాలో పంపినవే తప్ప, పూర్తి స్థాయి ఎన్నికల కమిషన్ అధికారికంగా పంపిన సంయుక్త లేఖ కాదని తెలిపింది. ఎన్నికల సంఘం అనేది సంపూర్ణ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ అని, సంస్థాగత నిర్ణయం లేకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే అది ఎగ్జిక్యూటివ్ జోక్యంగా ముద్రపడుతుందని సచివాలయం భావించింది. అందువల్ల ఈ విజ్ఞప్తులపై నేరుగా చర్యలు తీసుకోలేమని స్పష్టం చేస్తూ, లేఖల ప్రతులను రికార్డుల్లో భద్రపరిచింది.
అంతర్గత సమన్వయంపై విమర్శలు.. పెరిగిన రాజకీయ దుమారం
ఎలక్షన్ కమిషన్‌కు అంతర్గత వివాదాలను పరిష్కరించుకోవడానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, కమిషనర్లు ఇద్దరూ నేరుగా ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీని ఎందుకు ఆశ్రయించారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగ నిబంధనలు, 2023 కొత్త చట్టాల ప్రకారం ఏవైనా విభేదాలు వస్తే మెజారిటీ నిర్ణయం ద్వారా పరిష్కరించుకోవాలి లేదా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలి. అలా కాకుండా ప్రభుత్వ కార్యదర్శికి విన్నవించడం ఏంటని పలువురు మాజీ కమిషనర్లు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎన్నికల సంఘం పరిపాలనా విధానాన్ని, నిర్ణయాధికారాన్ని ప్రశ్నించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమలులోకి రాని ఉత్తర్వులు: ఎన్నికల సంఘం స్పష్టత
ఈ వివాదం సృష్టించిన కలకలంపై ఎన్నికల సంఘం స్పందిస్తూ ముందస్తు వివరణ ఇచ్చింది. మనీష్ గార్గ్ జారీ చేసిన సదరు బాధ్యతల మార్పు ఉత్తర్వులను ఇద్దరు కమిషనర్ల ఆదేశాల మేరకు తక్షణమే నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులు ఎంతమాత్రం అమలులోకి రాలేదని వెల్లడించింది. కాగా, కేబినెట్ సచివాలయం సమర్పించిన నివేదిక ప్రకారం, డెప్యుటేషన్‌పై వచ్చిన సదరు అధికారి భవిష్యత్తు సర్వీస్ రికార్డులు, బదిలీల నిర్ణయాల్లో ఈ ఫిర్యాదుల వివరాలను పరిగణనలోకి తీసుకునేందుకు వీలుగా సిబ్బంది శిక్షణ శాఖ (DoPT)కు సమాచారం పంపారు.














Click it and Unblock the Notifications
