అదానీ వ్యవహారంపై దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభయ సభల్లో రచ్చ!
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తొలిరోజే విపక్ష సభ్యుల నినాదాలు మారుమోగాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారంపైన లంచం మోసం ఆరోపణలపైన చర్చ చేయాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. లోక్సభలో అదానీ వ్యవహారంపైన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.
అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో రచ్చ
అదానీ వ్యవహారం పైన చర్చ చేపట్టాలని పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలినాడే విపక్ష సభ్యులు హౌస్ లో నినాదాలతో హోరెత్తించడంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశాలను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. గౌతమ్ అదాని వ్యవహారంపైన చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను ఎల్లుండికి వాయిదా వేశారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించిన గంటలోనే రచ్చ
ఈరోజు పార్లమెంటు సమావేశాలను ప్రారంభించిన గంటలోనే ఎంపీలు అదాని వ్యవహారంపైన చర్చ జరపాలని ఉభయసభలలో నినాదాలతో రచ్చ చేయడంతో అటు లోక్సభలోనూ, ఇటు రాజ్యసభలోను గందరగోళం చోటుచేసుకుంది. ఏఐసీసీ ప్రెసిడెంట్, సీనియర్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో అదాని వ్యవహారంపైన చర్చ మొదలు పెట్టాలని కోరారు. దీనికి రాజ్యసభ చైర్మన్ అంగీకరించలేదు.
ఎల్లుండికి ఉభయ సభలు వాయిదా
దీంతో సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి గందరగోళం సృష్టించడంతో సభను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. ఇక పార్లమెంటు సమావేశాలలో వ్యవహారంపైన చర్చ జరపాలని స్పీకర్ ముందు పదేపదే నినాదాలు చేయడంతో లోక్సభలో సైతం రగడ కొనసాగింది. దీంతో లోక్సభను కూడా ఎల్లుండికి వాయిదా వేశారు.
ఎక్స్ లో మల్లికార్జున ఖర్గే పోస్ట్
ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ప్రతిష్టను దిగజార్చే అంశంగా ఉన్న ప్రధాని లంచం మరియు మోసం ఆరోపణలపైన సవివరమైన చర్చను జరపాలని ఈరోజు ఇండియా కూటమి పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. దేశంలో ఎంతోమంది పెట్టుబడిదారులను మోసం చేసి అదానీ వారిని ప్రమాదంలో పడవేశారని దీనిపైన చర్చ జరపాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే ఎక్స్ లో ఒక పోస్ట్ లో వెల్లడించారు.
జేపీసీ ఏర్పాటుకు పార్లమెంట్ లో డిమాండ్
అదానీ గ్రూప్ అవినీతి ఆరోపణల పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నేడు పార్లమెంట్లో అదానీపై చర్చ జరపడానికి విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టారు. పార్లమెంటు సమావేశానికి ముందు కూడా ఇండియా కూటమి పార్టీల సమావేశంలో అదాని ఇష్యూ పైన ప్రధానంగా చర్చ జరిగింది. జెపిసి డిమాండ్ కు పార్లమెంట్లో ఒత్తిడి తేవాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తొలిరోజు అదాని వ్యవహారం పైన పార్లమెంట్లో రచ్చ రచ్చ కొనసాగింది.












Click it and Unblock the Notifications