శబరిమల చరిత్రలోనే సరికొత్త సేవ.. ఇక నేరుగా ఇంటికే అయ్యప్ప స్వామి ప్రసాదం
తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి ప్రసాదానికి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనకు తెలిసిన వారిలో ఎవరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా.. ప్రసాదం డబ్బా మన ఇంటికి వచ్చి చేరుతుంది. ఇప్పడు ఈ అరవణ ప్రసాదాన్ని భక్తులకు మరింత చేరువ చేసేలా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ,ఇండియన్ పోస్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పాయి. ఇకపై శబరిమల ప్రసాదాలను మోసుకుంటూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఇంటికే తెప్పించుకునే అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. రద్దీ సమయంలో భక్తుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టారు.
సన్నిధానంలోనే ప్రత్యేక పార్శిల్ కేంద్రం ఏర్పాటు
త్వరలో ప్రారంభం కానున్న మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని శబరిమలలో రౌండ్-ది-క్లాక్ ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ సముదాయంలోని అరవణ, అప్పం కౌంటర్ల పక్కనే ఈ పోస్టల్ కౌంటర్ కూడా పనిచేస్తుంది. భక్తులు దర్శనం ముగించుకుని నేరుగా ఇక్కడే ప్రసాదాలను బుక్ చేసుకుని తమ స్వగ్రామాలకు పార్శిల్ పంపుకోవచ్చు.

దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా డోర్‌డెలివరీ
శబరిమలలోని ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా బుక్ చేసుకునే అరవణ పాయసం, అప్పం వంటి పవిత్ర ప్రసాదాలు దేశంలో ఎక్కడికైనా సరే నేరుగా ఇంటికి డెలివరీ అవుతాయి. భక్తులు యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకునేసరికే ప్రసాదం వారి చిరునామాకు చేరేలా ఈ స్పీడ్ పోస్ట్ పార్శిల్ సేవలను రూపకల్పన చేశారు. ప్రయాణాల్లో బరువు మోసే టెన్షన్ ఇక పూర్తిగా తప్పుతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట ఆఫీసుల ద్వారా కూడా బుకింగ్ అవకాశం
కేవలం శబరిమలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఏ పోస్టాఫీసు ద్వారా అయినా సరే భక్తులు శబరిమల ప్రసాదాన్ని బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కేరళ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ అమితాబ్ సింగ్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ కె. జయకుమార్ సంయుక్తంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
భారీ రద్దీలోనూ భక్తులకు ఊరటనిచ్చే నిర్ణయం
మండల దీక్షా కాలంలో శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రసాదాలను కొనుగోలు చేసి వాటిని వెంటబెట్టుకుని ప్రయాణించడం భక్తులకు ఎంతో భారంగా మారుతుంటుంది. ఈ సరికొత్త పోస్టల్ సేవలతో భక్తులు తమకు కావలసినన్ని ప్రసాద ప్యాకెట్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి పంపుకోవచ్చు. సురక్షితమైన ప్యాకింగ్‌తో ఈ సేవలు భక్తులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.














Click it and Unblock the Notifications
