అయ్యప్ప స్వాములకు దేవస్వొం బోర్డు ముఖ్య గమనిక..: పంపాలో అలా చెయ్యొద్దు
కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. డిసెంబర్ 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకరవిళక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. ఈ 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకుంది. శుక్రవారం నాటికి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 11 లక్షలు దాటింది.
శబరిమలలో భక్తుల రద్దీ శుక్ర, శనివారాల్లో అధికంగా కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి వస్తోన్న అయ్యప్ప స్వాములతో జనసమ్మర్థంగా మారింది. కాలినడకన సన్నిధానానికి వెళ్లే భక్తుల శరణఘోషతో ఆధ్మాతిక వాతావరణం అక్కడ నెలకొంది. పంపా నదీలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. అనంతరం కాలినడకన అయప్పస్వామి దర్శనానికి బయలుదేరి వెళ్తోన్నారు.

కాగా- పంపా నదిలో అయ్యప్ప స్వాములు స్నానం చేసిన అనంతరం పాత దుస్తులను వదిలివేస్తోన్నారు. ఈ తొలి రెండు వారాల్లో టన్నుల కొద్దీ పాత దస్తులు కనిపించాయి. దీనిపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నివారించాలని, ఈ పద్ధతికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని, యాత్రీకులకు అవగాహన కల్పించాలని ట్రావెన్‌కోర్ దేవస్వొం బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది. పంపా నదిలో బట్టలు వదలడం ఆచారం కాదని భక్తులకు తెలియజేయాలని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.
దీంతో టీడీబీ తక్షణ చర్యలకు దిగింది. పంబా నదిలోకి యాత్రికులు బట్టలు పారవేయకుండా నిరోధించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ విషయాన్ని దేవస్వొం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బిజు తెలియజేశారు. దీనిపై 'మాతృభూమి' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బట్టలు పారవేయడాన్ని అరికట్టడానికి ఇప్పటికే 80 మంది ఉద్యోగులను నియమించినప్పటికీ, సరిపోలేదని బిజు చెప్పారు. ఇప్పుడు అదనంగా 15 మంది సిబ్బందిని నియమించామని అన్నారు. మెగాఫోన్‌తో ప్రతి 750 మీటర్లకు ఒకరు చొప్పున పర్యవేక్షిస్తారని అన్నారు.
నది నుండి బట్టలను తొలగించడానికి తమిళనాడుకు చెందిన పాండియన్‌కు దేవస్వం బోర్డు రూ. 2.8 లక్షల కాంట్రాక్టును ఇచ్చింది. ప్రస్తుతం సుమారు 100 మంది కార్మికులు ప్రతిరోజూ బట్టలను సేకరిస్తున్నారు. ఈ బట్టలను పారిశ్రామిక శుభ్రపరిచే యంత్రాలలో ఉపయోగించడానికి తమిళనాడుకు పంపుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications