సోనమ్ వాంగ్‌చుక్ తీవ్ర అస్వస్థత: హెల్త్ బులెటిన్ లో కారణాలు
దేశ రాజధానిలో సుదీర్ఘ పోరాటం సాగిస్తున్న ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుదీర్ఘకాలం పాటు కఠిన నిరాహార దీక్షను కొనసాగించడం వల్ల ఆయన శరీర వ్యవస్థ తీవ్రంగా బలహీనపడింది. దీనితో ఈ ఉదయం సుమారు 7.40 నిమిషాల సమయంలో చికిత్స నిమిత్తం ఆయనను అత్యవసరంగా ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తోన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలను ఆసుపత్రి సీనియర్ డాక్టర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబ అధికారికంగా వెల్లడించారు. వందల కిలోమీటర్ల మేర సాగిన సుదీర్ఘ పాదయాత్ర కారణంగా ఆయన శరీరం ముందు నుంచే బలహీనపడిందని, దీనికి తోడు నిరవధికంగా కఠిన నిరాహార దీక్షను పాటించడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యారని అన్నారు. జీర్ణ వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని వివరించారు.

దీనిపై ఆసుపత్రి ఓ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రస్తుతం సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. పూర్తి స్పృహలో ఉండటంతో పాటు చికిత్సకు స్పందిస్తున్నారు. గుండె వేగం, రక్తపోటు తదితర శారీరక ప్రాణాధార పారామీటర్లు అన్నీ ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నాయని బులెటిన్ పేర్కొంది. మొదట అత్యవసర విభాగంలో చేర్చుకుని చికిత్స అందించిన తర్వాత.. జనరల్ మెడిసిన్ విభాగానికి షిష్ట్ చేశారు డాక్టర్లు.
డీహైడ్రేషన్ కు గురి కావడం వల్ల వాంగ్‌చుక్ శరీర జీవక్రియల కోసం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్ దెబ్బతిన్నట్లు ల్యాబ్ పరీక్షల ద్వారా నిర్ధారించారు. ఈ సమస్యకు తక్షణ చికిత్స అందించడానికి డాక్టర్లు శ్రమిస్తోన్నారని డాక్టర్ చారు బాంబ పేర్కొన్నారు. ఆయనను డాక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచామని, సెలైన్ ద్వారా మందులను అందిస్తున్నామని, ఎలక్ట్రోలైట్స్ తిరిగి సరైన స్థాయికి చేరుకున్న తర్వాత ఆయన మొత్తం శారీరక స్థితిని మరోసారి సమీక్షించి డిశ్చార్జికి సంబంధించిన తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications