సినిమా టిక్కెట్: ఎంఎల్ఏ కొడుకు దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ నాయకులే కాదు, వారి వారసులు, బంధువులు దాడులకు పాల్పడుతున్నారు. మాల్ లో సినిమా టిక్కెట్లు అడిగినందుకు ఒక సెక్యూరిటి గార్డును చితకబాదారు. తమను ఎవరనుకుంటున్నావ్ అంటు మూకుమ్మడి దాడి చేశారు.
ఇంత జరిగినా పోలీసులు మాత్రం కేసు నమోదు చెయ్యకుండ చోద్యం చూస్తున్నారు. నిత్యం అరాచకాలు జరిగే ఉత్తర్ ప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో సమాజ్ వాద్ పార్టీ శాసన సభ్యుడు మున్నీ సింగ్ కుమారుడు ఉగ్రసేన్ ప్రతాప్ సింగ్ నివాసం ఉంటున్నాడు.
లక్నోలోని గోమతి నగర్ లోని ఒక మాల్ లో సినిమా చూడటానికి ఉగ్రసేన్ ప్రతాప్ సింగ్, అతని స్నేహితులు వెళ్లారు. తరువాత అక్కడ ఉన్న సెక్యూరిటిగార్డు సినిమా టిక్కెట్లు చూపించమని అడిగాడు. అంతే ప్రతాప్ సింగ్ తో పాటు అతని అనుచరులు రెచ్చిపోయారు.

తమను టిక్కెట్లు అడగడానికి ఎంత ధైర్యం అంటు చితకబాదారు. అడ్డు వెళ్లిన వారి మీద దౌర్జన్యం చేశారు. ఈ తతంగం మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. అయితే ప్రతాప్ సింగ్ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అధికారంలో ఉన్న నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు చేసినా పట్టించుకోవడం లేదని ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ అధికార ప్రతినిధి విజయ బహదూర్ పాఠక్ మండిపడుతున్నారు. అనవసరంగా విధులలో ఉన్న సెక్యూరిటి గార్డును చితకబాదారని సీసీ కెమెరా క్లిప్పింగ్ లను బయటపెట్టారు.












Click it and Unblock the Notifications