159 మందితో ఎస్పీ తొలి జాబితా రిలీజ్.. కర్హాల్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంతో రాజకీయ పార్టీ తమ దూకుడును మరింత పెంచాయి. గెలుపే లక్ష్యంగా తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. అధికారం తమదేనంటూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఎన్నికల కురుక్షేత్రంలో హీట్ పుట్టిస్తున్నాయి. పార్టీల తరుపున స్టార్ క్యాంపెయినర్లను ప్రచారాన్ని దించుతున్నాయి . ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అటు అభ్యర్థులు సైతం ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.
కర్హాల్ బరిలో అఖిలేష్ .. జస్వంత్ నగర్ నుంచి శివపాల్ సింగ్ యాదవ్
ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 159 మందితో కూడిన గెలుపు గుర్రాల జాబితాను విడుదల చేసింది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మొయిన్ పురి జిల్లాలోని కర్హల్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా , అఖిలేష్ యాదవ్ బాబాయ్, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ జస్వంత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

జైల్లో ఉన్న ఆజం ఖాన్ కు రాంపూర్ సీటు
మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్న పార్టీ నేత ఆజం ఖాన్‌కు రాంపూర్ సీటును ఎస్పీ కట్టబెట్టంది. పలు కేసుల్లో ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి 2020 నుంచి యూపీలో సీతాపూర్ జైలులో ఆజం ఖాన్ ఉన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖాన్ .. మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈసారి యూపీలో పాగ వేసేది సమాజ్ వాదీ పార్టీయేనని అఖిలేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

30 మందితో స్టార్ క్యాంపెయిన్
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా సమాజ్ వాదీ ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకుపోతుంది . ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితానూ విడుదల చేసింది. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీజేపీ నుంచి కొత్తగా పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్‌మయ్ నందా, ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ రాంగోపాల్ యాదవ్, రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్, ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ చీఫ్ నరేష్ ఉత్తమ్ పటేల్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాంగోవింద్ చౌదరితో పాటు ఇతర ప్రముఖలను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది.

యూపీలో ఏడు దశల్లో పోలింగ్
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10న మొదటి దశలో షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, హాపూర్, బులంద్‌షహర్, అలీఘర్, మథుర, ఆగ్రాలతో సహా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది..












Click it and Unblock the Notifications