రంగంలోకి నటుడు అంబరీష్: దర్శన్ వ్వవహారం ఓ కొలిక్కి వస్తుందా?
బెంగుళూరు: కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న నటుడు దర్శన్ కుటుంబ జీవితంలో చెలరేగిన కలహాం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తన భార్య విజయలక్ష్మిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లుగా ఓ ఆడియో టేప్ వాట్సాప్‌లో సంచలనం సృష్టిస్తోంది.
శుక్రవారం వాట్సాప్‌లో హాల్ చల్ చేసిన ఈ ఆడియోటేప్‌లో దర్శన్ తన భార్యపై అసభ్య పదజాలంతో తిడుతూ వినిపించింది. అయితే ఈ ఆడియో టేప్‌లో ఉన్నది దర్శన్ గొంతు కాదని ఆయన భార్య విజయలక్ష్మి చెబుతుండడం గమనార్హం. [నా కారు ప్రియుడికిచ్చేసింది: భార్యపై కన్నడ హీరో దర్శన్]
' పదమూడేళ్లుగా దర్శన్‌తో కలిసి ఉన్నాను, ఆయన నోటి వెంట ఎప్పుడూ ఇలాంటి పదజాలాన్ని నేను వినలేదు. అసలు ఆ గొంతు దర్శన్‌ది కాదు, మా మధ్య ఉన్న మనస్పర్థలను ఉపయోగించుకొని ఎవరో ఇదంతా సృష్టిస్తున్నారు' అని ఆమె పేర్కొన్నారు.
దర్శన్ ప్రవర్తన తనను ఇబ్బంది పెడుతోందని , అతడిని పిలిచి మందలించాలంటూ భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఉదయమే దర్శన్ విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు దర్శన్‌కు సూచించారు.

అయితే దర్శన్ తల్లి అనారోగ్యంగా ఉన్న కారణంగా శుక్రవారం సాయంత్రం విచారణకు హాజరవుతానని దర్శన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే దర్శన్, విజయలక్ష్మీల మధ్య నెలకొన్న మనస్పర్ధలను రాజీ చేసేందుకు గాను రాష్ట్ర మహిళా కమిషన్‌తో పాటు సీనియర్ నటుడు, మంత్రి అంబరీష్ రంగంలోకి దిగారు.
భర్త దర్శన్‌తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో విజయలక్ష్మి ఏడాదిన్నర కాలంగా వేరుగా ఉంటున్నారు. వీరి కుమారుడు సైతం తల్లితోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయలక్ష్మి నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చిన దర్శన్ అక్కడి సెక్యూరిటీ తో ఘర్షణ పడటంతో పాటు భార్య విజయలక్ష్మిని అసభ్య పదజాలంతో విరుచుకుపడినట్లు తెలిసింది.
దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న చెన్నమ్మన్న కెరె అచ్చుకట్ట స్టేషన్ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుని ఫిర్యాదు నమోదు చేశారు. కాగా, రెండేళ్లుగా దంపతులిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.
అయితే దర్శన్ వివరణ మాత్రం మరోలా ఉంది. నేను కొన్న లగ్జరీ ఆడీ కారు విజయలక్ష్మి తన ప్రియుడికి ఇచ్చింది. అతను నా వాహనంలో తిరుగుతున్నాడు. ఆ కారుకు ప్రమాదం కూడా చేశాడు. దాన్ని చూసి ఆ విషయాన్ని అడిగేందుకు విజయలక్ష్మి ఫ్లాట్ వద్దకు వెళ్లాను.
అంతే తప్ప నేను ఏ రకంగానూ గొడవ చేయలేదు. విజయలక్ష్మి ఉంటున్న ఫ్లాట్‌కు సంబంధించిన నిర్వహణ ఖర్చులతో పాటు ఇంటి అవసరాలకు కూడా నేనే డబ్బులు సమకూరుస్తున్నాను. అయినా నన్ను కనీసం ఇంటిలోకి రానివ్వకుండా సెక్యూరిటీతో అడ్డుకున్నారు అని దర్శన్ తెలిపారు.












Click it and Unblock the Notifications