రూపాయికే చీర : పోటెత్తిన మహిళలు
నోట్ల రద్దుకు మద్దతుగా కర్నాటక జిల్లాలోని బీదర్ లో సృష్టి-దృష్టి షోరూం యజమాని రూ.1కే చీరల అమ్మకాలు ప్రారంభించారు.
బీదర్: రూ.1కే చీర. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంత చౌకగా చీరలు దొరుకుతాయని తెలిస్తే మహిళలు ఊరుకుంటారా? పరుగులు పెట్టారూ? మరి అదే జరిగింది. సదరు దుకాణం వద్దకు పోటెత్తారు. చాలామంది తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. పోటెత్తిన మహిళలను అదుపు చేయడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
"అబ్బ సస్పెన్స్ తో చంపకండి.. ఎక్కడో చెబితే మేమూ వెళ్లి తెచ్చుకుంటాం కదా.." అంటారా? ఆగండాగండి.. అక్కడికే వస్తున్నాం. ఇది మన రాష్ట్రంలో కాదు.. కర్నాటక జిల్లాలోని బీదర్ లో. అక్కడి జిల్లా ఆసుపత్రి సమీపంలో సృష్టి-దృష్టి అనే చీరాల దుకాణం ఉంది.

ఈనెల 16 నుంచి ఈ దుకాణంలో చీరల అమ్మకాలు మొదలయ్యాయి. రూపాయి, రెండ్రూపాయలకే చీరలు అమ్మనున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో మహిళల నుంచి వస్తోన్న స్పందన అంతా ఇంతా కాదు. ఈ విక్రయాలు ఈనెల 26 వరకు సాగనున్నాయి.
దేశంలో నల్లదనం నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దుకు మద్దతుగా తాము అతి తక్కువ ధరకే చీరల అమ్మకాలు చేపట్టామని, దీనికోసం లక్ష చీరలు తెప్పించామని, రూపాయికే చీర అనగానే చాలామంది రూపాయి నాణెం ఇవ్వజూపుతున్నారని, అయితే తాము మాత్రం రూపాయి నోటు ఇచ్చినవారికే చీర అమ్ముతున్నామని సృష్టి-దృష్టి షోరూం యజమాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications