ఎమ్మెల్యేలతో వస్తా.. బలనిరూపణకు అవకాశమివ్వండి: గవర్నర్‌కు శశికళ మరో లేఖ
తన ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు వస్తానని తనకు అపాయింట్ మెంట్ ఇచ్చి, బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా శశికళ విన్నవించారు.
చెన్నై: అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ మరోసారి గవర్నర్ విద్యాసాగర్ రావుకు లేఖ రాశారు. లేఖలో పన్నీర్ రాజీనామా అంశాన్ని, బలనిరూపణ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. సీఎంగా పన్నీర్ రాజీనామాకు గవర్నర్‌గా విద్యాసాగర్ రావు ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో శశికళ గుర్తుచేసినట్టుగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని లేఖలో శశికళ విజ్ఞప్తి చేశారు. తన ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు వస్తానని తనకు అపాయింట్ మెంట్ ఇచ్చి, బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా శశికళ విన్నవించారు. సంక్షోభం మొదలై ఏడు రోజులు కావస్తుండటంతో.. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

గవర్నర్ కు లేఖ రాసిన అనంతరం శశికళ మీడియాతో మాట్లాడారు.అన్నాడీఎంకె పార్టీలో ఉన్న చీడపురుగులు ఇప్పుడు బయటపడుతున్నాయని, వారి ఆటలు సాగబోవని శశికళ తేల్చి చెప్పారు. ఎంజీఆర్ మరణానంతరం చాలా సవాళ్లను ఎదుర్కొని జయలలిత పార్టీని కాపాడారని గుర్తుచేశారు.
ప్రస్తుతం తమకు అలాంటి సవాళ్లే ఎదురవుతున్నాయని, ధైర్యంగా ముందుకు వెళదామని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. పార్టీని, ప్రభుత్వాన్ని తాను కాపాడతానని శశికళ ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే పార్టీ కోటను ఎవ్వరూ పెకిలించలేరని, అమ్మ ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.
కాగా, తనకు 130మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ తొలినుంచి చెబుతోన్న సంగతి తెలిసిందే. మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను జారిపోకుండా చూసుకునేందుకు రిసార్టుల్లో వారిని దాచిపెట్టారు.
ఇదే క్రమంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలను బయట తీసుకొచ్చేందుకు చెన్నై డీజీపీ రాజేంద్రన్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం కాంచీపురం ఎస్పీ ముత్తరసి ఆధ్వర్యంలో కొంతమంది పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి రిసార్టులపై దాడి చేసినట్టుగా సమాచారం.
రిసార్టుల్లో 90మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించగా.. ప్రస్తుతం వారి లెక్కింపు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలను నిర్బంధించారని శశికళపై ఆరోపణలు వస్తుండటంతో రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications