శశికళ అరెస్టుకు రంగం: జైలు వద్ద భారీ బందోబస్తు, వ్యక్తిగత భద్రత తొలగింపు
అన్నాడీఎంకే అధినేత్రి శశికళను జైలుకు తరలించేందుకు రంగం సిద్ధమవుతోంది. శశికళకు సుప్రీం కోర్టు నుంచి ఇంకా కాపీ అందలేదు. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేల్చిన న్యాయస్థానం..
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళను జైలుకు తరలించేందుకు రంగం సిద్ధమవుతోంది. శశికళకు సుప్రీం కోర్టు నుంచి ఇంకా కాపీ అందలేదు. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఈ రోజు (మంగళవారం) నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
ప్రస్తుతానికి ఆమె వద్దకు కాపీ చేరలేదు. కాపీ ఆమెకు చేరితే కచ్చితంగా సరెండర్ కావాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శశికళ లొంగిపోయిన అనంతరం ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలుకు తరలించనున్నారు.
గతంలో జయలలిత ఉన్న జైలులోనే శశికళను కూడా ఉంచే అవకాశాలున్నాయి. పరప్పన అగ్రహారం జైలు వద్ద ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో వివిఐపీ సెల్ లేదు. కర్నాటక మాజీ సీఎం యెడ్యూరప్పను ఉంచిన జైలులోనే గతంలో జయలలితను ఉంచారు. అప్పుడు జయలలిత నెంబర్ 7402, శశికళ నెంబర్ 7403.

శశికళకు సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఇక్కడ పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం వద్ద నగర పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో కర్నాటక రాష్ట్ర రిజర్వు పోలీసు, నగర సాయుధ రిజర్వు సిబ్బంది కారాగారం వద్ద మోహరించారు.
హోసూర్ చెక్ పోస్ట వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. శశికళ మద్దతుదారులు నగరంలోకి ప్రవేశించకుండా ముందుజాగ్రత్తగా ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోయెస్ వద్ద భద్రత తొలగింపు
శశికళకు సుప్రీం కోర్టు ధృవీకరించిన జైలుశిక్ష, జరిమానాల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఆమె నివసిస్తూ వచ్చిన పోయెస్ గార్డెన్ దగ్గర ప్రభుత్వ భద్రతను తొలగించారు. పనిలో పనిగా శశికళకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా తొలగించారు. దీంతో పోయెస్ గార్డెన్ వద్ద కళ తప్పింది.












Click it and Unblock the Notifications