రైతులు చనిపోతే పట్టించుకోరా -వారి కోసం పదవినైనా వదులుకుంటా : గవర్నర్ సత్యపాల్ మాలిక్..!!
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల క్రితం తాను జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో వందల కోట్ల లంచం ఒక ఫైల్ ఆమోదం కోసం ఇవ్వబోయారంటూ చెప్పుకొచ్చిన ఆయన, ఇప్పుడు రైతుల ఉద్యమం గురించి వ్యాఖ్యలు చేసారు. ''కుక్క చనిపోయినా ఢిల్లీ నేతలు సంతాపం తెలుపుతారు. కానీ తీవ్రమైన చలిలో ఆందోళన చేస్తున్న రైతులు చనిపోతే పట్టించుకోరా" అంటూ ప్రశ్నించారు.

పదవి అయినా వదులుకుంటా
రైతుల ఆందోళనపై తాను ఏమన్నా మాట్లాడితే, వివాదాస్పదంగా మారుతోందని, అయినా రైతుల ఉద్యమానికి తన మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలని అడిగితే, గవర్నర్ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సైతం ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త పార్లమెంటు భవనానికి బదులుగా ప్రపంచ స్థాయి కాలేజీ కడితేనే బాగుంటుందని సూచించారు. తనకు గవర్నర్ పదవి పుట్టుకతోనే రాలేదని.. దానిని వదులుకోవటానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు.

ఇందిరా గాంధీ హత్య ప్రస్తావన
కానీ, రైతుల పైన తనకున్న నిబద్దతను మాత్రం వీడనని స్పష్టం చేసారు. రైతుల ఇబ్బందులను చూస్తూ సహించలేనని వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 600 మంది రైతులు చనిపోయారని చెప్పుకొచ్చారు. అయినా మోదీ సర్కారు ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 1984లో ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత సిక్కు అంగరక్షకులే హత్య చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Recommended Video

రైతులు ఆగ్రహించే రోజు రాకూడదంటూ
ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలా మంది సిక్కులు, జాట్లు ఉన్నారని, వారికి కోసం తెప్పించవద్దని ప్రధాని మోదీని అప్రమత్తం చేశానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. నాడు గురుద్వారా ఘటన నేపథ్యంలో తాను చనిపోతానని ఇందిరా గాంధీకి తెలుసన్నారు. అందుకే ఆమె తన ఫాంహౌస్‌లో మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించేవారంటూ చెప్పుకొచ్చారు.
ఈరోజు మీరు (మోదీ) అధికారంలో ఉన్నారని..రేపు ఏమైనా జరగవచ్చన్నారు. తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా జనం గళం విప్పుతారని చెప్పారు. రైతులు ఆగ్రహించే రోజు రాకూడదనే తాను కోరుకుంటున్నానంటూ మాలిక్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications