జస్టిస్ లోయా కేసు: అన్ని ఆధారాలు చూపాలి: సుప్రీం సంచలనం
న్యూఢిల్లీ: జస్టిస్ బీఎం లోయా అనుమానాస్పద మృతి కేసులో వాస్తవాలను పిటిషనర్లకు తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో వైద్య నివేదికతో పాటు అన్ని రకాల డాక్యుమెంట్లను పిటిషనర్లు పరిశీలించేందుకు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు మహరాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం నాడు ఆదేశించింది.
సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న సమయంలో సీబీఐ జడ్జి జస్టిస్ బీ ఎం లోయా మరణించారు. ఈ కేసుపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గత గురువారం అంగీకరించింది.

మంగళవారం నాలుగు నిమిషాలపాటు ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్లకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మహరాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తోంది. ఒక పిల్‌ను బంధురాజ్ శంభాజీ అనే జర్నలిస్టు దాఖలుచేయగా, మరొకదానిని రాజకీయ ఉద్యమకారుడు తెహసీన్ పూనావాలా దాఖలు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారు. అన్ని డాక్యుమెంట్లను పిటిషనర్లకు అందజేయడానికి అభ్యంతరం లేదన్నారు. అయితే, పిటిషనర్లు ఆ డాక్యుమెంట్లను బహిరంగపరచకూడదని కోరారు.
సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించిన విధంగా అన్ని డాక్యుమెంట్లను సీల్డ్ కవర్‌లో పెట్టి సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సమర్పించింది.
విచారణను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. పిటిషనర్లు అదనపు డాక్యుమెంట్లను సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చునని పేర్కొంది.












Click it and Unblock the Notifications