Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం-ఆగస్టు 2 నుంచి మళ్లీ విచారణ..
జమ్ము-కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు రాజ్యాంగంలో నిర్దేశించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై మూడేళ్ల క్రితం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత దాన్ని మూలపడేసింది. ఇప్పుడు మరోసారి ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సిద్ధమైంది. ఆగస్టు 2 నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టు ఇవాళ వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్న న్యాయమూర్తులు ఎస్.కె. కౌల్, సంజీవ్ ఖన్నా, బి.ఆర్.గవాయ్, సూర్యకాంత్ దీనిపై ఇవాళ వాదనలు విన్నారు. రెగ్యులర్ విచారణ మాత్రం ఆగస్టు 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.

ఆగస్టు 2 నుంచి ఆర్టికల్ 370పై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. ఇంకా ఎవరైనా ఈ పిటిషన్లపై వాదనలు వినిపించాలనుకున్నా, అభిప్రాయాలు చెప్పాలన్నా జూలై 27లోపు రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఆ తర్వాత మాత్రం ఎలాంటి అభ్యర్ధనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటికే తాజా అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు.
మరోవైపు ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా తమ అభ్యర్థనలను కొనసాగించకూడదని, కోర్టు రికార్డుల నుండి తమ పేర్లను తొలగించాలని కోరుతున్న ఐఏఎస్ అధికారి షా ఫైసల్, సామాజిక కార్యకర్త షెహ్లా రషీద్ చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీం కోర్టు అనుమతించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం ముందు ప్రస్తావించినప్పుడు, సీజేఐ చంద్రచూడ్ పిటిషన్ల జాబితాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే 2019 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు దాదాపు నాలుగేళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
2020లో ఈ అంశాన్ని చివరిసారిగా సుప్రీంకోర్టులో లిస్ట్ చేసినప్పుడు, ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని ఏడుగురు న్యాయమూర్తుల పెద్ద బెంచ్‌కు సూచించాలనే పిటిషనర్ల వాదనలను అంగీకరించడానికి నిరాకరించింది. ఆర్టికల్ 370 యొక్క వివరణతో కూడిన ప్రేమ్ నాథ్ కౌల్ కేసు, సంపత్ ప్రకాష్ కేసులలో అత్యున్నత న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పులు పరస్పర విరుద్ధంగా లేవని అప్పటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications