సీఎం కోసం సీఎల్పీ భేటీలో సీక్రెట్ బ్యాలెట్- అర్ధరాత్రి దాటాక రిజల్ట్ ఇదే: తేల్చేసిన ఎమ్మెల్యేలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది కాంగ్రెస్. 1989 తరువాత ఈ స్థాయి ఓట్ షేర్‌ను కాంగ్రెస్ అందుకోవడం ఇదే తొలిసారి.
కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఆదివారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశమైంది. సాయంత్రం 6:00 గంటల సమయంలో బెంగళూరులో ఓ స్టార్ హోటల్‌లో ఏర్పాటైన ఈ కీలక సమావేశానికి కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులందరూ హాజరయ్యారు. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన హరపనహళ్లి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే లత మల్లికార్జున్ ఇందులో పాల్గొన్నారు.

సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ హాజరయ్యారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు ఈ భేటీ కొనసాగింది. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోయారు.
సిద్ధరామయ్య- డీకే శివకుమార్‌లల్లో ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుందనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. దళిత ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ కూడా తెరమీదికి వచ్చింది. సీనియర్ దళిత నేత డాక్టర్ జీ పరమేశ్వరకు అవకాశం ఇవ్వాలనే అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 50-50 ప్రాతిపదికన ఇద్దరి పేర్లను కూడా ప్రకటిస్తే ఎలా ఉంటుదనే విషయం కూడా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య లేదా డీకే శివకుమార్‌లల్లో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై తొలుత- వన్ టు వన్‌గా శాసన సభ్యులతో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వారెవరూ కూడా నేరుగా తమ అభిప్రాయాలను వెల్లడించడానికి సిద్ధపడలేదు. తమకు ఎవరైనా ఒకటే అనే అభిప్రాయాన్ని మెజారిటీ సభ్యులు వెల్లడించారు. అనుభవజ్ఞుడు కావడం వల్ల కొందరు సీనియర్లు సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పకపోవడంతో సీక్రెట్ బ్యాలెట్‌ను నిర్వహించారు. 135 శాసన సభ్యుల్లో 120 మంది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అర్ధరాత్రి 1:30 గంటలకు దీనికి సంబంధించిన ఫలితాలను సుర్జేవాలా ప్రకటించారు. కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకు 72 మంది మద్దతు పలికారు. డీకే శివకుమార్‌కు అనుకూలంగా 48 మంది ఓటు వేసినట్లు తెలుస్తోంది.
#WATCH | Karnataka: We have taken the views from all the MLAs, the meeting went on till 2am. We have prepared a report and will submit it to the Congress president: Bhanwar Jitendra Singh, AICC observer in Bengaluru, on the decision on the state chief minister#Karnataka pic.twitter.com/nwrHFWsTd3
— ANI (@ANI) May 15, 2023
మిగిలిన వారు మౌఖికంగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వెల్లడైన ఫలితాలు, సీఎల్పీ సమావేశం సారాంశం మొత్తాన్నీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా పార్టీ అధిష్టానానికి పంపించారు. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికే వదిలివేశారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకుంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications