లాడెన్‌ను వేటాడి చంపినట్టు దావూద్‌నూ: శివసేన, బీజేపీపై ఆగ్రహం
ముంబై: మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. దావూద్‌ను భారత్‌కు అప్పగించండని పాకిస్తాన్‌ను కోరడం మానుకోవాలని సూచించింది. దీనికి బదులుగా అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను వేటాడి హతం చేసినట్లుగా భారత్ కూడా సాహసం చేయాలని సూచించింది.
దావూద్ కరాచీలో ఉన్నట్లు ఆధారాలున్నాయంటూ కేంద్రం ఇటీవల ఓ టేప్‌ను విడుదల చేయడం పైనా శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి మాటలు కటిపెట్టి ఆచరణలోకి దిగాలని పేర్కొంది. అప్పుడే ఫలితం ఉంటుందని పార్టీ అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది.
దావూద్ ఇబ్రహీం, ఇబ్రహీం, హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లోనే ఉన్నారని, అక్కకే ఉన్నారని నిరూపించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అలాంటి వారికి ఆశ్రయం ఇచ్చేది ఒక్క పాకిస్థాన్ మాత్రమేనని, వారికి ఆ దేశంలోని కొంతమంది రాజకీయ నేతల అండ కూడా ఉందని ధ్వజమెత్తింది.

దావూద్‌ను అప్పగించాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుతూనే ఉన్నామని, అందుకు పాకిస్తాన్ అంగీకరించకపోగా, అసలు అతను తమ దేశంలోనే లేడని చెబుతోందని, ఈ విషయంలో భారత్ కూడా నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ఆగ్రహించింది. దావూద్ కార్యకలాపాలపై తాము దృష్టి సారించామని భారత్ చెబుతోందని, అదే సమయంలో ఉగ్రవాదులు కూడా మన దేశంపై కన్నేశారని ఇలా ఒకరిని ఒకరు చూసుకొనే వాచింగ్ గేమ్ వల్ల ప్రయోజనం శూన్యమని పేర్కొంది.
ఇది కొన్నేళ్లుగా కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ ఇలాగే జరుగుతోందని అభిప్రాయపడింది. దావూద్‌ను ఎప్పుడు పట్టుకుంటారన్న విలేకరుల ప్రశ్నకు.. ఇటీవల లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. వెయిట్ అండ్ వాచ్ అని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications