కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్ రూఫ్: విచారణకు ఆదేశించిన రామ్మోహన్ నాయుడు
Delhi Airport: దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1 రూఫ్ టాప్ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటలుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల దెబ్బకు ఈ దుర్ఘటన సంభవించింది.
మొన్నటి వరకు రికార్డుస్థాయి ఎండ తీవ్రతతో అల్లాడిన ఢిల్లీ.. ఇప్పుడు అతి భారీ వర్షాలకు కుదేల్ అవుతోతంది. అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది.

ఈ వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే- ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పైకప్పు సైతం కుప్పకూలిపోయింది. విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పైకప్పు కొంతభాగం మొత్తం భళ్లుమంటూ కుప్పకూలింది. వర్షపునీరు మొత్తం లోనికి ప్రవహించింది.
వర్షపునీటిని బయటికి తీసుకెళ్లే పైపులు పగిలిపోయాయి. నీరంతా సీలింగ్‌పై ప్రవహించింది. దాని బరువుగా ఒక్కసారిగా రూఫ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కార్లు ధ్వంసం అయ్యాయి. రూఫ్ సపోర్టింగ్ పిల్లర్ ఓ క్యాబ్‌పై పడింది. ఆ సమయంలో డ్రైవర్ కారులోనే ఉన్నారు. అతి కష్టం మీద అతన్ని బయటికి తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలు, వెలుతురు లేమి, ప్రతికూల వాతావరణం వల్ల విమానాల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు. టెర్మినల్ 1ను పాక్షికంగా మూసివేశారు. వర్షం తీవ్రత తగ్గిన తరువాత మళ్లీ విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు.
#WATCH | Latest visuals from Terminal-1 of Delhi airport, where a roof collapsed amid heavy rainfall, leaving 6 people injured pic.twitter.com/KzxvkVHRGG
— ANI (@ANI) June 28, 2024
ఈ ఘటన పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటోన్నామని అన్నారు. గాయపడ్డవారికి నాణ్యమైన వైద్య సహాయాన్ని అందించాలంటూ అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications