స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం: శోకసంద్రంలో..
భోపాల్: ద్వారక శారదా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. ఆయన వయస్సు 99 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని నరసింహపూర్ జిల్లా గోటేగావ్ సమీపంలోని ఝొతేశ్వర్ ఆశ్రమంలో ఈ మధ్యామ్నం 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన శిష్యులు, ఆశ్రమం ప్రతినిధులు అక్కడే ఉన్నారు. స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందిన విషయం తెలుసుకుని భక్తులు శోకసంద్రంలో మునిగారు.
ఆయన పార్థివ దేహాన్ని దర్శించడానికి ఆశ్రమానికి చేరుకుంటోన్నారు. ఈ నెల 2వ తేదీ నాడే ఆయన తన 99వ జన్మదిన వేడుకలను భక్తుల మధ్య జరుపుకొన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి తగాదా కేసులో సుదీర్ఘకాలం పాటు పోరాడారు స్వామి స్వరూపానంద సరస్వతి. ఈ కేసులో తీర్పు రామజన్మభూమి ట్రస్ట్‌కు అనుకూలంగా వచ్చిన తరువాత ఇక ఆలయ నిర్మాణంలో తలమునకలయ్యారు.

అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న రామమందిరం నిర్మాణానికి విలువైన సూచనలు ఇచ్చారు. స్వరూపానంద సరస్వతి స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని సివ్నీ జిల్లా జబల్‌పూర్ సమీపంలో గల దిఘోరి గ్రామం. 1924 సెప్టెంబర్ 2వ తేదీన ఆయన జన్మించారు. అసలు పేరు పోథీరామ్ ఉపాధ్యాయ. తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆయన ఇంటిని విడిచారు. ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించారు. వారణాశిలో వేదాలను అభ్యసించారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. విప్లవ సాధువుగా పేరు తెచ్చుకున్నారు.

1950లో శంకరాచార్య స్వామి బ్రహ్మానంద సరస్వతి చేతుల మీదుగా సన్యాసాన్ని స్వీకరించారు. స్వామి స్వరూపానంద సరస్వతిగా పేరు మార్చుకున్నారు. 1982లో స్వామి స్వరూపానంద సరస్వతి గుజరాత్‌లోని ద్వారక శారదా పీఠం ఉత్తరాధికారికగా నియమితులయ్యారు. అదే సమయంలో ఉత్తరాఖండ్ బద్రినాథ్‌లోని జ్యోతిర్మఠం బాధ్యతలను స్వీకరించారు. రామజన్మభూమి స్థలం కోసం సుదీర్ఘకాలం న్యాయపోరాటం సాగించారు. సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు.












Click it and Unblock the Notifications