ఛీ..ఛీ.. ఏం చిల్లరగాళ్లు రా..? గాడిదల తోకలు కత్తిరించి ఎత్తుకెళ్లి.. క్షుద్ర పూజలు..!
మూగ జీవాలపై కర్కశంగా ప్రవర్తించారు కొందరు దుండగులు.. నోరు లేని ఆ జంతువులపై ప్రేమను చూపించాల్సింది పోయి.. వాటికి తీవ్రంగా హాని కలిగించారు. మనుషులు.. ఇతర జంతువుల మాదిరి ఎదురు దాడి చేయలేవన్న ధీమాతో ఇలా రాక్షసంగా ప్రవర్తించారు. రక్తపు గాయాలతో విలవిల్లాడుతున్న ఆ గాడిదలను చూసి గ్రామస్థులు చలించారు. వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఆ మూగ జీవాలకు ప్రథమ చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
మూగ జీవాలను చాలా మంది ప్రేమగా చూసుకుంటారు. కుక్కలు, పిల్లుల్ని కన్నబిడ్డల్లా సాకుతారు. ఇక గేదెలు, ఆవులు, గాడిదలు, గుర్రాలు.. ఇలా అనేక సాధు జంతువులను ఇంట్లో పెట్టుకుని వాటికి మేత వేస్తూ అలాగే వాటి నుంచి పాలు, ఇతర సేవలను పొందుతుంటారు. అయితే కొందరు మూగజీవాలపై కర్కశంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా తమిళనాడులోని వేలూరులోనూ ఇలాంటి అమానవీయ ఘటన జరిగింది. కొందరు దుండగులు.. గాడిదల తోకలను కత్తిరించుకుని పరారయ్యారు. అవి రక్తపు గాయాలతో విలవిల్లాడుతూ కనిపించడంతో గ్రామస్థులు చలించిపోయారు.
ఏం జరిగిందంటే..?
వాళ్లది రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబం. వారి వద్ద ఉన్న ఆ గాడిదలే వారి ఆస్తి.. వాటి ద్వారానే ఆ కుటుంబానికి ఆదాయం వస్తుంది. వాళ్లు రజక కుటుంబానికి చెందిన వారు కావడంతో బట్టల మూటలను మోసేందుకు గాడిదలను పెంచుకుంటున్నారు. అయితే రోజూ మాదిరిగానే గాడిదలను మేతకు వదిలారు. అయితే సాయంత్రానికి గాడిదలు ఇంటికి వచ్చాయి. అయితే ఆ గాడిదలను చూసి ఆ కుటుంబం షాక్ అయింది. వాటి తోకలు కత్తిరించి ఉన్నాయి. రక్తపు గాయాలతో ఆ గాడిదలను చూసి చలించిపోయింది ఆ కుటుంబం. కన్నీరుమున్నీరుగా విలపించసాగింది.
తమిళనాడులోని వేలూరు జిల్లా పేరణాంబుట్టులో ఈ దారుణమైన ఘటన జరిగింది. పేరణాంబుట్టు పట్టణ ప్రాంతంలో సుమారు 50 కు పైగా రజక కుటుంబాలు నివసిస్తున్నాయి. బట్టల మూటలను మోయడానికి వీరు గాడిదలను పెంచుకుంటున్నారు. ఇక్కడ నివసించే గోవిందరాజ్, శరవణన్, రాజా, శివ అనే వ్యక్తులకు చెందిన పదికి పైగా గాడిదలు రోజువారీలాగే మేత కోసం సమీప ప్రాంతాలకు వెళ్లాయి.

సాయంత్రం వేళ గాడిదలు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, వాటిని చూసిన యజమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మూడు గాడిదల తోకలు పూర్తిగా కత్తిరించి, రక్తంతో తడిసి ఉండటాన్ని వారు గమనించారు. మరికొన్ని గాడిదల మీద వెంట్రుకలను కూడా కత్తిరించి ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
క్షుద్ర పూజల కోసమేనా..?
ఈ అమానుష చర్య చూసి కన్నీరుమున్నీరైన రజక కుటుంబాలు.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు లేదా మంత్ర తంత్రాల కోసమే గాడిదల తోకలను, వెంట్రుకలను కోసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్పందించిన 108 సిబ్బంది..
రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న గాడిదల పరిస్థితిని చూసి యజమానులు సహాయం కోసం అర్థించగా, అక్కడే ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించారు. మానవత్వంతో గాడిదల వద్దకు చేరుకుని, వాటి గాయాలకు మందులు రాసి కట్టుకట్టారు. మూగజీవాల పట్ల జరిగిన ఈ క్రూరమైన ఘటన పేరణాంబుట్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలాన్ని, ఆందోళనను రేకెత్తించింది.












Click it and Unblock the Notifications