ప్రత్యూష గర్భవతి కానీ.., ప్రియుడిపై ఆధారాలు కష్టమేనా?
ముంబై: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. జేజే ఆసుపత్రి డాక్టర్లు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సమాచారం మేరకు... అదే సమయంలో ఆత్మహత్యకు ముందు ఆమె అబార్షన్ చేయించుకొని ఉండవచ్చునని తెలుస్తోంది.
ఏప్రిల్ 1వ తేదీన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యలో రోజుకో షాకింగ్ అంశం వెలుగు చూస్తోంది. ఆమెను ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రత్యూష ఆత్మహత్య కేసులో.. ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పైన కేసు నమోదయింది. ఆత్మహత్యకు అతను పురికొల్పినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రత్యూష తల్లిదండ్రులు కూడా కేసు అలాగే పెట్టారు. అయితే, రాహుల్ రాజ్ సింగ్.. ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా ఆధారాలు కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.

రాహుల్ రాజ్ సింగ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ కేసులో రాహుల్ రాజ్ సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. దానిని సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత 12వ తేదీన హైకోర్టులో అతనికి ఊరట లభించింది. 18వ తేదీ వరకు అరెస్టు వద్దని ఆదేశించింది.
ఈ సందర్భంగా తన ముందస్తు బెయిల్ పిటిషన్ దరఖాస్తులో రాహుల్ రాజ్ సింగ్ పలు అంశాలను ప్రస్తావించాడు. ప్రత్యూష మృతి చెందిన రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులు తన పైన ఫిర్యాదు చేశారని పేర్కొన్నాడు. వారి వెనుక ఏదో ఒత్తిడి ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని చెప్పాడు.
మరోవైపు, రాహుల్ రాజ్ సింగ్... ప్రత్యూష సూసైడ్ నోట్ రాస్తే దానిని దాచిపెట్టాడా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రత్యూష ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications