ప్రభుత్వం తీరుతో పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోయిన అతి పెద్ద కంపెనీ, మంత్రి ఏం చెప్పారంటే ?
బెంగళూరు: సెమీ కండక్టర్ సెక్టార్ కు సంబంధించిన kayne's టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సమర్పించిన ప్రతిపాదనపై కర్ణాటక ప్రభుత్వం స్పందించడంలో ఎలాంటి లోపం లేదని ఆ రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి ఎంబీ పాటీల్ శుక్రవారం స్పష్టం చేశారు. కంపెనీ పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడంతో సిద్దరామయ్య ప్రభుత్వం ఉలిక్కిపడింది.
మైసూర్‌కు బదులుగా తెలంగాణలో OSAT (అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్) యూనిట్ నిర్మాణాన్ని kayne's టెక్నాలజీస్ ప్రారంభించిందని వ్యాపారవేత్త మోహన్ దాస్ పాయ్ తెలిపారు. దీనికి కర్ణాటక ఆలస్య వైఖరే కారణమని కంపెనీ నిర్వహకులు ట్విట్టర్ లో(X) పోస్టు చెయ్యడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఎంబీ పాటిల్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

రూ. 500 కోట్లకుపైగా పరిశ్రమల స్థాపన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీలో ఆమోదం అవసరం. అయితే మేము కమిటీ సమావేశానికి ముందే kayne's కంపెనీకి ఆమోదం తెలిపామని, ప్రభుత్వ ఉత్తర్వు (GO) ఇచ్చామని, ఇంత చేసినా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆ కంపెనీ నిర్వహకులు నిందించడం సరికాదని మంత్రి ఎంబీ పాటిల్ అభిప్రాయపడ్డారు.
kayne's కంపెనీ తెలంగాణకు వెళ్లడానికి దాని స్వంత కారణాలు ఉండవచ్చు అని, వారు మా నుండి మరిన్ని మినహాయింపులు కోరుకున్నారో లేదో మాకు తెలియదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని. దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతోనూ చర్చించామని మంత్రి ఎంబీ పాటిల్ వివరించారు. కానీ కంపెనీ అంచనాలు అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘించలేమని మంత్రి ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు.

అమెరికా వెళ్లినప్పుడు కూడా kayne's కంపెనీతో టచ్ లో ఉన్నామని, వాళ్లు అడిని ప్రతి విషయానికి మేము స్పందించామని మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారు. ఈ పరిణామాలు మోహన్ దాస్ పాయ్ కి బహుశా తెలియకపోవచ్చు. మా పరిశ్రమ, వాణిజ్య శాఖ కమిషనర్ వారితో మాట్లాడి వివరిస్తారని మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో కర్ణాటక రాష్ట్రం ముందంజలో ఉందని, త్వరలో ఇక్కడ 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications