Siddaramaiah:డీకే శివకుమార్,రాహుల్ గాంధీలకు సిద్ధూ పొలిటికల్ చెక్!

కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా నలుగుతున్న ముఖ్యమంత్రి మార్పు ఉత్కంఠకు తెరపడింది. హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. అయితే, కురువృద్ధుడైన ఈ ఓబీసీ నేత కేవలం పదవి నుంచి తప్పుకోవడమే కాకుండా, వెళ్తూ వెళ్తూ కాంగ్రెస్ అధిష్ఠానానికి, తన తర్వాత పగ్గాలు చేపట్టబోయే డీకే శివకుమార్‌ (DKS)కు ఒక పెద్ద రాజకీయ సవాల్‌ను విసిరారు. బుధవారం సాయంత్రం ఆయన అత్యంత వివాదాస్పదమైన 'సామాజిక మరియు విద్యా సర్వే' (కుల గణన) నివేదికను అధికారికంగా ఆమోదించడం ద్వారా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, కాబోయే సీఎం డీకే శివకుమార్‌లను ఇరకాటంలో పడేశారు. సిద్ధరామయ్య తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం, దాని పరిణామాలపై ప్రత్యేక విశ్లేషణ.

రెండు కుల గణనలు.. సిద్ధరామయ్య మార్క్ రాజకీయం

గత తొమ్మిదేళ్లలో కర్ణాటకలో రెండుసార్లు కులాల సర్వేలు జరిగాయి, ఈ రెండు సార్లూ సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా ఉండటం గమనార్హం. 2013-18 మధ్య సిద్ధరామయ్య తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు హెచ్. కాంతరాజ్ నేతృత్వంలో ఒక సర్వే నిర్వహించారు. 2017 నాటికే ఆ నివేదిక సిద్ధమైనప్పటికీ, లింగాయత్‌లు, ఒక్కలిగలు వంటి ఆధిపత్య కులాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా దానిని ఏ ప్రభుత్వం కూడా బయటపెట్టలేదు.

siddaramaiah-s-silent-political-strategy-dk-shivakumar-and-rahul-gandhi-under-pressure-as-he-gives-n

2023లో మళ్లీ అధికారంలోకి వచ్చాక, సిద్ధరామయ్య 2025లో సరికొత్తగా మరోసారి కుల గణన సర్వేకు ఆదేశించారు.దాదాపు రూ. 635 కోట్ల వ్యయంతో,5.9 కోట్ల జనాభాను కవర్ చేస్తూ 54 ప్రశ్నలతో ఈ బృహత్తర సర్వే సాగింది.నవంబర్ 2025 నుంచీ సిద్ధంగా ఉన్న ఈ కొత్త నివేదికను,తాను రాజీనామా చేయడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు (మే 27న) రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ కె. మధుసూదన్ నాయక్ నుంచి సిద్ధరామయ్య అత్యంత వేగంగా స్వీకరించి,ఆమోదముద్ర వేశారు.

డీకే శివకుమార్‌కు నిప్పుల కొలిమి

సిద్ధరామయ్య తీసుకున్న ఈ నిర్ణయం కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారనుంది. లీక్ అయిన సమాచారం ప్రకారం..ఈ కొత్త కుల గణనలో వెనుకబడిన తరగతులు (OBCs),దళితులు కలిపి రాష్ట్ర జనాభాలో దాదాపు 69.6 శాతంగా ఉన్నారు.ముస్లింలు 14 శాతంతో అత్యంత పెద్ద సామాజిక వర్గంగా అవతరించగా,ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాన్ని శాసించిన లింగాయత్‌లు (11%), ఒక్కలిగలు (10-12%) జనాభా పరంగా ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్కలిగ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు సంకట స్థితిలో పడ్డారు:

నివేదికను అమలు చేస్తే: తమ జనాభా శాతం తగ్గిందని భావిస్తున్న ఒక్కలిగ, లింగాయత్ వర్గాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

నివేదికను పక్కన పెడితే: సిద్ధరామయ్య బలంగా నిర్మించిన 'అహిందా' (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితుల కూటమి) ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు శాశ్వతంగా దూరం అవుతుంది.

వెళ్తూ వెళ్తూ సిద్ధరామయ్య డీకేఎస్ దారిలో ఒక రాజకీయ ల్యాండ్ మైన్ అమర్చి వెళ్లారని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాహుల్ గాంధీకి 'సామాజిక న్యాయం'పరీక్ష

దేశవ్యాప్తంగా కుల గణనను "సమాజానికి ఎక్స్-రే" అని అభివర్ణిస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో దీనినే ప్రధాన అస్త్రంగా మార్చుకున్న రాహుల్ గాంధీకి ఈ పరిణామం జాతీయ స్థాయిలో సవాలుగా మారింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన జరిపి చూపిస్తామని రాహుల్ పదే పదే చెప్పారు. ఇప్పుడు కర్ణాటకలో ఓబీసీ నేత అయిన సిద్ధరామయ్య స్థానంలో,ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్‌ను సీఎంగా కూర్చోబెడుతున్న తరుణంలో,ఒకవేళ కొత్త ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెడితే..రాహుల్ గాంధీ జాతీయ నినాదానికి విశ్వసనీయత తప్పుతుంది."సొంత రాష్ట్రంలోనే కుల గణన నివేదికను అమలు చేయలేని కాంగ్రెస్, దేశవ్యాప్తంగా ఎలా చేస్తుంది?" అని బీజేపీ ప్రశ్నించే అవకాశం రాహుల్ గాంధీకి పెద్ద తలనొప్పిగా మారనుంది.

ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకున్నప్పటికీ, కర్ణాటక రాజకీయాల్లో తన 'అహిందా' సిద్ధాంతం,తన ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని సిద్ధరామయ్య ఈ ముగింపు అస్త్రం ద్వారా నిరూపించారు.హైకమాండ్ ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును కూడా తిరస్కరించి,రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు సిద్ధరామయ్య చేసిన ఈ చివరి వ్యూహాత్మక దాడితో అటు డీకే శివకుమార్, ఇటు రాహుల్ గాంధీ ఇద్దరూ ఆత్మరక్షణలో పడ్డారు.రాబోయే రోజుల్లో ఈ కుల గణన నివేదిక కర్ణాటక రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+