సర్ ప్రక్రియ నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఫామ్- 6 లో సవరణలు చేయలేదు.. సుప్రీంకోర్టుకు వివరించిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు తలెత్తాయని.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని వస్తున్న ఆరోపణలను భారత ఎన్నికల సంఘం మరోసారి తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి విషయాన్ని చట్టానికి లోబడే ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ఎన్నికల సంఘం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.
సర్ ప్రక్రియకు సంబంధించిన అన్ని నిర్ణయాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా తీసుకొంటున్నారని.. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే వ్యవహరిస్తున్నారని అలాగే ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడానికి ఉపయోగించే ఫామ్ 6 లోనూ సవరణలు చేశారని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు కేవలం ఒకే ఒక్క న్యూస్ మీడియా నివేదిక ఆధారంగా దాఖలైనవేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ మేరకు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేసిన భారత ఎన్నికల సంఘం.. ఈ అఫిడవిట్ ను సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు కలిసి ఉమ్మడిగా ఆమోదించారని ఈసీ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. అలాగే సర్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 2025, జూన్ 24, అక్టోబర్ 27 అలాగే 2026, మే 14 తేదీల్లో జారీచేసిన ఉత్తర్వులు సైతం ఏకగ్రీవంగా జారీ చేసినవేనని అఫిడవిట్ లో ఈసీ పేర్కొంది. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేముందు కమిషనర్ల వ్యక్తిగత సూచనలు, ప్రశ్నలు లేదా భిన్నాభిప్రాయాలు అంతర్గత సూచనల కిందకే వస్తాయని.. అంతిమంగా తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ సమష్టిగానే ఉంటాయని ఈసీ వివరించింది.

మరోవైపు సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు నమోదు కోసం ఉద్దేశించిన ఫామ్-6 లోనూ ఎలాంటి సవరణలు చేయలేదని సుప్రీంకోర్టుకు అందించిన అఫిడవిట్ లో ఈసీ స్పష్టం చేసింది. ఈ ఫామ్ లో ఏదైనా మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications
