ఆత్మహత్య వెనక వదినే: సినీ నటి ఫొటోతో ప్రేమలోకి దింపి...
బెంగళూరు: భర్త కుటుంబంపై కక్ష గట్టిన ఓ మహిళ తన మరిది ఆత్మహత్యకు కారణమైంది. ప్రేమలో ఓడిపోయానంటూ హాసన్‌లోని రాఘవేంద్ర అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ప్రేయసి కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఆత్మహత్య కేసు విచిత్రమైన మలుపు తిరిగింది. సొంత వదినే అతని ఆత్మహత్యకు కారణమని పోలీసులు దర్యాప్తులో తేలింది.
హాసన్‌కు చెందిన దివ్యతో అదే గ్రామానికి చెందిన మాదేష్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే, దివ్యకు అంతకు ముందే ఓ పెళ్లి జిరిగినట్లు మాదేష్‌కు తెలిసింది. దీంతో అతను ఆమెను వదిలేశాడు. పెళ్లి సమయంలో లాంఛనాల కింద ఇచ్చిన రూ.8 లక్షల సొత్తును తిరిగి అతను దివ్యకు ఇవ్వలేదు. దీంతో ఆమె మాదేష్ కుటుంబంపై పగ పెంచుకుంది.
మాదేష్ తమ్ముడు రాఘవేంద్రకు అను పేరుతో ఫోన్ చేస్తూ పరిచయం పెంచుకుని, ముగ్గులోకి లాగింది. నువ్వు లేకుంటే నేను బతకలేనంటూ చెప్పింది. దానికితోడో ఓ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి ఓ తమిళ సినీ నటి ఫొటో పెట్టింది. ఆ ఖాతా ద్వారా అను పేరుతో రాఘవేంద్రతో చాటింగ్ చేస్తూ వచ్చింది.

దాంతో రాఘవేంద్ర అను పేరుతో చాటింగ్ చేస్తున్న దివ్య ప్రేమలో పడిపోయాడు. అయితే, దివ్య అను పేరుతో ఓ రోజు ఫోన్ చేసి తనకు 15 రోజుల క్రితం వివాహమైందని, పెద్దల ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, తనను మరిచిపోవాలని చెప్పింది. దాంతో మనస్తాపానికి గురైన రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.
కేసు దర్యాప్తు క్రమంలో పోలీసులు దివ్యతో మాట్లాడారు. వారికి ఆమెపై అనుమానం రాఘవేంద్ర ప్రేమ విషయం తనకు తెలుసునని, ఏడాదిగా వాళ్లు ప్రేమించుకుంటున్నారని చెప్పింది. అయితే, అనుకు వేరే వ్యక్తితో పెళ్లి కావడంతో రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. కేసును పక్కదారి పట్టించడానికి అను కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పింది.
ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోనే పోలీసులకు, మీడియా ప్రతినిధులకు అందించింది. అయితే, దివ్య తీరుపై, ఫొటోపై పోలీసులకు అనుమానం కలిగింది. అయితే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. రాఘవేంద్ర డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుతో పాటు ఉన్న ఫోన్ నెంబర్ తీసుకుని కాల్‌డేటాతో పాటు వివరాలు రాబట్టారు. దీంతో ఆ ఫోన్ నెంబర్ వాడుతున్నది దివ్యనే అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను తమదైన రీతిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది.












Click it and Unblock the Notifications