పరువు కోసం తమ్ముడి ప్రాణం తీసిన అక్క!
ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న పలు ఘటనలు చూస్తే ఒకింత ఆశ్చర్యం.. మరోవైపు భయం కలుగుతుంది. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం, హత్యలు చేసుకోవడం ఇన్నాళ్లు చూశాం. కానీ లేటెస్ట్ గా కర్ణాటకలో జరిగిన విషయం అందరినీ కలవరపెడుతుంది. తమ్ముడికి నయం కాని వ్యాధి సోకిందని.. ఆ సంగతి బయటపడితే కుటుంబ పరువు పోతుందని భర్తతో కలిసి అతడిని హతమార్చింది ఓ అక్క. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హొళల్కెర పరిధిలోని దుమ్మికి చెందిన నాగరాజప్పకు మల్లికార్జున, నిశా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. నిశాకు శ్యామనూరుకు చెందిన మంజునాథ్‌తో వివాహం జరగగా.. మల్లికార్జున బెంగళూరులో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.

అయితే మల్లికార్జున ఇటీవల సొంతూరు వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన అతడిని దావణగెరెలోని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స నిమిత్తం రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మల్లికార్జునకు నయం కాని వ్యాధి సోకినట్టు గుర్తించారు. ఆ విషయాన్ని నిశాకు వెల్లడించారు.
ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మల్లికార్జునను మరో చోటుకి తీసుకెళ్తుండగా.. తనకు ఉన్న వ్యాధి గురించి అక్కతో ఓపెన్ అయ్యాడు. అలానే అప్పులు కూడా చేసినట్టు చెబుతూ తనకు జీవించే ఆసక్తి లేదని కన్నీటి పర్యంతం అయ్యాడు. దీంతో ఈ వ్యాధి గురించి బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భావించిన నిశా.. తమ్ముడిని చంపాలని నిర్ణయించుకుంది.

మార్గం మధ్యలోనే తన భర్త మంజునాథ్ సాయంతో.. మల్లికార్జున గొంతుకు టవల్ బిగించి హత్య చేసింది. మల్లికార్జున మృతదేహాన్ని సొంత ఊరుకు తీసుకొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలోనే చనిపోయినట్టు కుటుంబ సభ్యులను నమ్మించారు. అయితే అంత్యక్రియల సమయంలో మల్లికార్జున గొంతు వద్ద గాయాలను గమనించిన నాగరాజప్ప.. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలోనే నిశా, మంజునాథ్‌లను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిని అదుపులోకి తీసుకొని హత్య కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications