Helicopter Crash: దైవ భూమిలో ఘోర ప్రమాదం. బద్రీనాథ్ కొండల్లో కూలిన హెలికాప్టర్..
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు ఆరుగురు ప్రయాణికులతో బయలుదేరిన ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన ఒక ప్యాసింజర్ హెలికాప్టర్ (కాల్ సైన్ VT-HCX) చమోలీ జిల్లా జోషిమఠ్ వద్ద ప్రమాదానికి గురైంది. మధ్యాహ్నం 1:14 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దట్టమైన మేఘాలు, వర్షం కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం జోషిమఠ్ సమీపంలోని ఛాయ్ గ్రామం పైన ఉన్న సైనిక క్యాంప్ వద్ద చాపర్ కూలిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ కెప్టెన్ హిమాన్షుతో పాటు ప్రతాప, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్ కెహెచ్ఎస్ నటరాజ అనే ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. చాపర్ కూలిపోయిన వార్త అందగానే భారత సైన్యం, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలానికి చేరుకోవడానికి ప్రత్యేక రెస్క్యూ బృందాలు బయలుదేరగా, ప్రతికూల వాతావరణం, మంచు కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఘటనపై సీఎం స్పందన.. ఎమర్జెన్సీ అలర్ట్!
ఈ దారుణ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జోషిమఠ్ సమీపంలోని ఛాయ్ గ్రామం వద్ద హెలికాప్టర్ కూలిపోయిన విషయాన్ని ఆయన ధ్రువీకరిస్తూ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని తక్షణమే మెరుగైన వైద్యం కోసం ఎయిర్‌లిఫ్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, ముందుజాగ్రత్త చర్యగా సదరు విమానయాన సంస్థ (ట్రాన్స్ భారత్ ఏవియేషన్)కు చెందిన అన్ని హెలికాప్టర్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు .
#WATCH | Uttarakhand: A team from the district administration is currently searching for the missing helicopter travelling from Badrinath to Dehradun.Smoke was seen rising near Chaien village in Joshimath, following the disappearance of the helicopter. There are six people on board the helicopter, including five passengers and one pilot: Chamoli district administration
— ANI (@ANI) October 30, 2026
అడుగడుగునా ప్రమాదాల ముప్పు!
ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రా మార్గాల్లో వాతావరణం క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. ఈ నెలలోనే ప్రతికూల వాతావరణం వల్ల రుద్రప్రయాగ్‌లో ఒక హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ కాగా, సాంకేతిక లోపంతో తెహ్రీలో మరో చాపర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇప్పుడు ఏకంగా పర్వత ప్రాంతంలో ప్యాసింజర్ చాపర్ కూలిపోవడంతో యాత్రికులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాద బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
హిమపాతం ధాటికి అతలాకుతలం.. పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ప్రస్తుతం ఉత్తరాఖండ్ వ్యాప్తంగా వాతావరణం అత్యంత భయంకరంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్‌లో ఈ సీజన్‌లోనే తొలిసారిగా భారీ హిమపాతం నమోదైంది. గురువారం నుంచి కురుస్తున్న మంచు వర్షంతో పరిసర పర్వతాలన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి తీవ్ర చలి గాలులు వీస్తున్నాయి. ఉత్తరకాశీ, తెహ్రీ, హరిద్వార్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే రోజుల్లోనూ వర్షాలు.. యాత్రికులకు హెచ్చరికలు!
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే కొన్ని రోజుల పాటు కొండ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, హిమపాతం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నవంబర్ తొలి వారం వరకు వాతావరణం ఇలాగే ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చమోలీ, ఉత్తరకాశీ జిల్లా యంత్రాంగం అత్యవసర సహాయ కేంద్రాలను (DEOC) అప్రమత్తం చేసింది. గంగోత్రి, యమునోత్రి మార్గాలను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ వెళ్లే భక్తులు, యాత్రికులు వాతావరణ పరిస్థితులను గమనించి, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications
