భూకుంభకోణం: రాహుల్‌పై మరోసారి స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాటల దాడిని అమాంతం పెంచేశారు. రాహుల్ సొంత నియోజక వర్గంలో పర్యటిస్తున్న ఆమె గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు.
ఆదివారం ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ అమేథిలో ఓ సైకిల్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన 65 ఎకరాల భూమిని అక్రమంగా గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ట్రస్ట్ కొనుగోలు చేసిందని ఆరోపించారు.
ఒక్క గజం భూమిని కూడా వృధాగా పోనివ్వనని మాట్లాడిన రాహుల్ గాంధీ తన కుటుంబం చేసిన అవినీతిని మరచిపోయారా? అని ఆమె ప్రశ్నించారు. అమేథి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గాంధీ కుటుంబం విఫలమైందన్నారు.

ఒక సైకిల్ ఫ్యాక్టరీ కోసం 1980లో పేద రైతుల నుంచి సేకరించిన 65 ఎకరాల భూమి రాజీవ్ గాంధీ ట్రస్ట్‌కు ఎలా చేరిందని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. సైకిల్ ఫ్యాక్టరీకి 90 ఏళ్లు లీజుకు ఇచ్చిన భూములను రాజీవ్ గాంధీ ట్రస్ట్‌కు ఎలా విక్రయించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చే వరకు బీజేపీ కార్యకర్తలు పోరాటం సాగిస్తారని స్మృతి వెల్లడించారు. స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ అవి పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications