సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాకు ఊరట
న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. సోహ్రబుద్దీన్ కేసులో అమిత్ షాపై వచ్చిన అభియోగాలను సిబిఐ ప్రత్యేక న్యాయ స్థానం మంగళవారంనాడు తోసిపుచ్చింది. సిబిఐ పేర్కొన్న విషయాలను పూర్తిగా అంగీకరించడానికి వీలు లేదని, అమిత్ షాపై నిందితుడిగా అభియోగాలు మోపలేమని తన అభిప్రాయమని ప్రత్యేక న్యాయమూర్తి ఎంబి గోసావి అన్నారు.
తీర్పు వివరాలు ఇప్పుడే అందుబాటులో లేవు, షేక్ ఎన్‌కౌంటర్ కేసులో సాక్షి అయిన తులసి ప్రజాపతి ఎన్‌కౌంటర్ కేసు నుంచి కూడా కోర్టు అమిత్ షాను విముక్తం చేసింది. ఆ కేసును ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్ నుంచి ముంబైకి బదిలీ చేశారు. గుజరాత్ మాజీ హోం మంత్రి అయిన అమిత్ షాపై, మరో 18 మందిపై సిబిఐ 2013 సెప్టెంబర్‌లో అభియోగాలు మోపింది. అభియోగాలు ఎదుర్కుంటున్నవాళ్లలో పోలీసు అధికారులు కూడా ఉన్నారు.

షా మీద క్రిమినల్ కుట్ర, సాక్ష్యాల తారుమారు, ఆయుధాల చట్టం కింద నేరాలు వంటి అభియోగాలు మోపారు. సిబిఐ కథనం ప్రకారం - సోహ్రబుద్దీన్‌ను, అతని భార్య కౌసర్ బీని గుజరాత్ తీవ్రవాద నిరోధక బృందం 2005 నవంబర్‌లో అపహరించి, చంపేసింది.
సోహ్రబుద్దీన్‌కు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని, ముఖ్యమైన నాయకులను హతం చేయడానికి అతను ప్రణాళికలు వేశాడని గుజరాత్ పోలీసులు ఆరోపించారు. ఆ తర్వాత ఓ ఏడాదికి 2006 డిసెంబర్‌లో తులసిరామ్ ప్రజాపతిని గుజరాత్ పోలీసులు కాల్చి చంపారు. ఎన్‌కౌంటర్ కేసులో సాక్షి అని ప్రజాపతి కస్టడీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అతన్ని హతమార్చినట్లు చెప్పారు.
ఈ రెండు హత్యల్లోనూ అప్పుడు గుజరాత్ హోం మంత్రిగా ఉన్న అమిత్ షా పాలు పంచుకున్నారని, పోలీసులు ఆ విషయం అమిత్ షాకు చెప్పారని సిబిఐ ఆరోపించింది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో అమిత్ షా ఉన్నారు. తనను ఆ కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేశారు. మూడు నెలల తర్వాత ఆయన బెయిల్ లభించింది.












Click it and Unblock the Notifications