సోనియా సంచలన నిర్ణయం: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రియాంక?..
కాంగ్రెస్ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా రాహుల్ నియామకం ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో.. అధినేత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారనుంది.
న్యూఢిల్లీ: స్కాములతో మునిగిపోయి.. బీజేపీ మేనియాలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలనే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ వారసుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యారనే విమర్శల నేపథ్యంలో ఆయన స్థానంలో ప్రియాంక గాంధీయే కరెక్ట్ అన్న ఆలోచనకు అధినేత్రి సోనియా గాంధీ వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా రాహుల్ నియామకం ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో.. అధినేత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారనుంది. రాహుల్ కన్నా ప్రియాంక గాంధీ అయితేనే పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలరని సోనియా గాంధీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇదే విషయాన్ని పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతల వద్ద సోనియా గాంధీ ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో సోనియా స్వయంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.

ప్రియాంక పేరును సోనియా ప్రస్తావించడంతో పార్టీకి చెందిన పలువురు నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రియాంక గురించి సోనియా తీసుకొచ్చిన ప్రస్తావన సాధారణమైందేనని, కానీ ఆమె మనసులో ఏదో బలంగా ఉందనిపిస్తోందని, దీని వెనకాల ఆమె చాలా ఆలోచించి ఉండవచ్చునని సీడబ్ల్యూసీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
కాగా, ఆరోగ్యం సహకరించకపోవడం, వయసు మీద పడటంతో పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని సోనియా గాంధీ చాలాకాలంగా భావిస్తున్నారు. దీంతో మరో రెండు నెలల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై ఆమె తుది నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications