ఎన్నికల్లో సోషల్ మీడియా జోక్యం అఢ్డుకోండి-కేంద్రాన్ని కోరిన సోనియాగాంధీ
భారత్ లో జరుగుతున్న ఎన్నికల రాజకీయాల్లో నానాటికీ పెరిగిపోతున్న సోషల్ మీడియా జోక్యాన్ని అడ్డుకోవాలని ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి, ఎంపీ సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ బడ్డెట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో బడ్డెట్ ప్రసంగంపై మాట్లాడిన సోనియాగాంధీ.. ఈ మేరకు భారత ఎన్నికల రాజకీయాల్లో సోషల్ మీడియా అనుచిత జోక్యంపై మాట్లాడారు.
భారత ఎన్నికల రాజకీయాల్లో ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా దిగ్గజాల క్రమబద్ధమైన జోక్యానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో జీరో అవర్ లో మాట్లాడిన సోనియాగాంధీ.. అల్ జజీరా, ది రిపోర్టర్స్ కలెక్టివ్‌లో ప్రచురించిన నివేదికను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే ఫేస్‌బుక్ ఎన్నికల ప్రకటనల కోసం బీజేపీకి చౌకైన ఒప్పందాలను ఆఫర్ చేసిందని సోనియా ఈ కథనాలను ఉటంకిస్తూ ఆరోపించారు.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని ఎన్నికల రాజకీయాలలో ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా దిగ్గజాల క్రమబద్ధమైన జోక్యాన్ని, ప్రభావాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సోనియా తెలిపారు. తన డిమాండ్ పక్షపాత రాజకీయాలకు అతీతమైనదని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామా లేదా అన్న దానితో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరం కేంద్రంపై ఉందని సోనియాతెలిపారు.
Recommended Video
దేశంలో భిన్న వర్గాల మధ్య ద్వేషాన్ని ప్రచారం చేసేవారిని అనుమతించడంలో ఫేస్‌బుక్ తన నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని సోనియా ఆరోపించారు. యువకులు, వృద్ధుల మనస్సులు ఒకే విధంగా ఉండవని, వాటిలో భావోద్వేగాలు, తప్పుడు సమాచారం ప్రకటనల వల్ల ద్వేషంతో నింపేస్తున్నారని సోనియా విమర్శించారు. దీని వల్ల సదరు సంస్ధలు మాత్రమే లాభపడుతున్నాయని అన్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే.. భావ ప్రకటనా స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణచివేసిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications