మీరే చెప్పించారు: టిపై సోనియా, మార్చిలో సీమాంధ్రకు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై మీలో బాధ ఉందని తనకు తెలుసునని కానీ, 2004లో మీరే నాతో తెలంగాణ ప్రకటన చేయించారని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సీమాంధ్ర ప్రాంత నేతలతో అన్నట్లుగా తెలుస్తోంది. బుధవారం పలువురు సీమాంధ్ర నేతలు సోనియాను కలిసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004 నుండి విభజనపై ఎన్నో సంప్రదింపులు జరిగాయని వారికి చెప్పారు. మీకేం కావోలో చెప్పాలని సూచించారు. మీ ప్రాంతానికి ఏం కావాలో చెప్పాలని ముఖ్యమంత్రి సహా అందర్నీ అడిగినా స్పందించలేదన్నారు.

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని చెప్పిన సోనియా, అండగా ఉన్నందుకు పార్టీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. పార్టీ ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నదో తనకు తెలుసునని అయితే, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సవాలునైనా ఎదుర్కోగల శక్తి ఉందని, మీరంతా అతి కష్టసమయంలో పార్టీ వెనుక నిలబడ్డారని ఆమె వారితో అన్నారు.
మీరు ఇలాగే నిలబడితే పార్టీ అస్తిత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని చెప్పారు. విభజన తర్వాత సీమాంధ్రకు జరిగే నష్టాన్ని సాధ్యమైనంత పూరించేందుకుగాను చర్యలు తీసుకున్నామని, పార్టీ నేతలు అడిగిన ప్రయోజనాలనన్నిటినీ కల్పించామన్నారు. నియోజకవర్గాలక వెళ్లి ఎవరు అండగా ఉంటారో తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి చిరకాలంగా అండగా నిలుస్తున్న వర్గాలను దూరం చేసుకోవద్దని, కొత్త సామాజిక సమీకరణలకు అవకాశం కల్పించాలని సూచించారు.
సోనియాతోపాటు ప్రధాని మన్మోహన్, రాహుల్ గాంధీలు కూడా తమ ప్రాంతంలో పర్యటించి ప్రజలకు భరోసా ఇవ్వాలని మంత్రులు కోరారు. ఇందుకు సోనియా అంగీకరించారు. బహిరంగ సభల తేదీలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ స్పష్టత ఇస్తారని సోనియా తెలిపారు. మార్చి నెలలో సభలు పెట్టుకుందామని అక్కడే ఉన్న దిగ్విజయ్ అన్నారు.
గత పది సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని, రాష్ట్ర విభజన నేపథ్యంలో అది మరింత పెరిగిందని సీమాంధ్ర మంత్రులు చెప్పగా, సోనియా అంగీకరించారు. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయటం, వలసలను తగ్గించటం, సీమాంధ్ర ప్రజలకు భరోసా ఇవ్వటం అన్న అంశాలపై పార్టీ నేతలు ఆమెకు వివరించారు. దాదాపు 45 నిమిషాలు భేటీ జరిగింది.












Click it and Unblock the Notifications