సోను సూద్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం.. ప్రముఖ నటుడు సోను సూద్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొద్దిసేపటి కిందటే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. తొలుత- అరవింద్ కేజ్రీవాల్‌తో సోను సూద్ సమావేశం కానున్నారంటూ వచ్చిన వార్తలు దేశ రాజధానిలో హల్‌చల్ చేశాయి. సోను సూద్ సొంత రాష్ట్రం పంజాబ్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి మరీ దీన్ని చూశారు.

ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి
సోను సూద్ లేదా ఆయన చెల్లెలు వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఊహాగానాలు గానే మిగిలిపోయాయి. అయినప్పటికీ- సోను సూద్‌కు మాత్రం ఊహించిన దాని కంటే బంపర్ ఆఫర్ ప్రకటించింది కేజ్రీవాల్ సర్కార్. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కేజ్రీవాల్ ప్రభుత్వం రూపకల్పన చేసిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు సోను సూద్.

దేశ్ కె మెంటార్స్ కోసం
ఆ కార్యక్రమం పేరే- దేశ్ కే మెంటార్స్. ఈ పథకం ఇంకా అమలు కావాల్సి ఉంది. వచ్చే వారం ఈ పథకాన్ని అరవింద్ కేజ్రీవాల్ లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. ఢిల్లీ పరిధిలో నివసించే లక్షలాది మంది విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. పాఠశాల విద్య దశ నుంచే వారి కేరీర్‌ను తీర్చిదిద్దడం, విద్యతో పాటు సామాజిక అంశాలు, సమాజంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమానికి ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రూపకల్పన చేసింది.

సోనూ సూద్‌కు ఆఫర్..
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ భావించారు. ఈ క్రమంలో ఆయన సోను సూద్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగా- కొద్దిసేపటి కిందటే సోనూ సూద్..ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా వారిద్దరి మధ్య సమావేశం కొనసాగింది. అనంతరం ఇద్దరూ కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా..
దేశ్ కే మెంటార్స్ కార్యక్రమానికి సోను సూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికి అంగీకరించినందుకు సోను సూద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో పేద కుటుంబాలను ఆదుకున్న మంచి మనిషిగా అభివర్ణించారు. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నానని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Recommended Video

విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడం కంటే గొప్ప ఏముంటుంది?
దేశ్ కే మెంటార్స్ కార్యక్రమానికి తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల సోను సూద్ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.లక్షలాది మంది విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడం కంటే గొప్ప పని ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను తాను చిరునవ్వుతో స్వీకరిస్తున్నానని అన్నారు. విద్యార్థులకు నైతిక విలువలు, సమాజం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తన సరికొత్త ప్రయాణం విజయవంతమౌతుందని అన్నారు.












Click it and Unblock the Notifications