సభా ఘటనలపై విచారణ: స్పీకర్, ప్రవేశపెట్టినట్లే: సిపిఐ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును (తెలంగాణ బిల్లును) లోకసభలో ప్రవేశపెట్టిన సమయంలో గురువారం జరిగిన సంఘటనలపై స్పీకర్ మీరా కుమార్ విచారణకు ఆదేశించారు. సెక్యూరిటీ కమిటీ ఆ సంఘటనలపై విచారణ జరుపుతుంది. ఆ కమిటీకి డిప్యూటీ స్పీకర్ నేతృత్వం వహిస్తారని ఆమె చెప్పారు. రేపు (శనివారం) మధ్యాహ్నం కమిటీ సమావేశమవుతుంది.
స్పీకర్ అనుమతి ఇచ్చారు కాబట్టి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లేనని సిపిఐ పార్లమెంటు సభ్యుడు గురుదాస్ దాస్ గుప్తా అన్నారు. అయితే, బిల్లును ప్రవేశపెట్టిన పద్ధతి మాత్రం సరైంది కాదని ఆయన శుక్రవారం అన్నారు. గురువారంనాడు పార్లమెంటులో జరిగిన ఘటనలు దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.

గురువారంనాడు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన సమయంలో అనూహ్యమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బహిష్కృత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొట్టడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. కళ్లు మంటలు ఎక్కడంతో స్పీకర్ మీరా కుమార్ లేచి వెళ్లిపోయారు.
లగడపాటి రాజగోపాల్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చాకు బయటకు తీసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications