సుప్రీంకోర్టులో సంచలనం.. ఒక్క రోజే 400 కేసులు క్లోజ్!
సుదీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్న బాధితులకు ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సంచలన ఫలితాలను ఇస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న 'సమాధాన్ సమారోహ్ 2026' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ తొలి రోజే మైలురాయిని అధిగమించింది. నేడు ఒక్క రోజే ఏకంగా 400 కంటే ఎక్కువ వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కారమై రికార్డు సృష్టించాయి.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్ కోసం సుప్రీంకోర్టు సముదాయంలో ఏకంగా 16 ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేశారు. ప్రతీ బెంచ్‌లో ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులతో పాటు సీనియర్ అడ్వకేట్లు, అడ్వకేట్-ఆన్-రికార్డ్ ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరించారు. ఈ ధర్మాసనాల ముందుకు తొలిరోజు విచారణ కోసం 600కు పైగా వివిధ రకాల కేసులు రాగా, కక్షిదారుల మధ్య పరస్పర సంభాషణను ప్రోత్సహిస్తూ 400కు పైగా కేసుల్లో ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కీలక పాత్ర పోషించారు.

కుటుంబ వివాదాల నుంచి పన్నుల కేసుల వరకు!
ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పలు రకాల సున్నితమైన కేసులను విచారణకు స్వీకరించారు. భార్యాభర్తల మధ్య వైవాహిక వివాదాలు, ఆస్తి తగవులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహారం పిటిషన్లు, భూసేకరణ-పరిహారం వివాదాలతో పాటు పన్నులకు సంబంధించిన కేసులు, సర్వీస్, లేబర్ వివాదాలను ఇందులో పరిష్కరించారు. ఏప్రిల్ 21న 'సమాధాన్ సమారోహ్' ప్రారంభమైనప్పటి నుంచి కక్షిదారులు, వారి తరఫు న్యాయవాదులతో ముందుగానే చర్చలు జరిపి ఒప్పంద అవకాశాలను అంచనా వేయడం వల్లే ఈ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయని కోర్టు తెలిపింది.
కోర్టుల భారం తగ్గడమే లక్ష్యం
ఏళ్ల తరబడి సాగే న్యాయపోరాటాలు కక్షిదారులపై మోపే ఆర్థిక, మానసిక భారాలను తగ్గించడమే ఈ లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశం. సంప్రదింపులు, పరస్పర అంగీకారం ద్వారా సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను ప్రోత్సహించడం ద్వారానే త్వరితగతిన న్యాయం అందించవచ్చని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆగస్టు 23 వరకు కొనసాగే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ముగింపుతో 'సమాధాన్ సమారోహ్ 2026' విజయవంతంగా పూర్తి కానుంది.














Click it and Unblock the Notifications