లాలూకు షాక్: పార్టీకి 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా
పాట్నా: త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆర్జెడికి చెందిన 13 మంది శాసనసభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరందరూ కూడా అధికార పార్టీ అయిన జెడియూలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
బీహార్ అసెంబ్లీలో 22 మంది సభ్యులను కలిగి ఉన్న ఆర్జెడి నుంచి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 9కి పడిపోయింది. పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఆర్జెడి చీఫ్ విప్ రాకేష్ కుమార్ నాయకత్వం వహించారు. ఆయన సామ్రాట్ చౌదరిగా ప్రాచూర్యం పొందారు. రాకేష్ కుమార్ నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలందరూ తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నరేన్ చౌదరికి సోమవారం మధ్యాహ్నం అందజేశారు.

తామందరం ఆర్జెడి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించాలని స్పీకర్‌ను రాకేష్ కుమార్ కోరారు. స్పీకర్ వారి అభ్యర్థనను వెంటనే అంగీకరించినట్లు సమాచారం. రెబల్ ఎమ్మెల్యేల్లో ఐదుగురు ముస్లిం సభ్యులు ఉండగా, ముగ్గురు యాదవ కులానికి చెందిన వారున్నారు. రాజీనామా చేసిన సభ్యులందరూ అధికార పార్టీ అయిన జెడియూ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.
లాలూ ప్రసాద్ యాదవ్ తమను సంప్రదించకుండానే కాంగ్రెస్ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్నారనే ఆగ్రహంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మూడు సార్లు ఓడిపోయినా పార్టీకి అండగా నిలిచిన తమను పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదని అసహనంతో వారందరూ పార్టీని వీడినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు తగినన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని వారు ఆరోపించినట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా తాము తమ పార్టీకి రాజీనామా చేయలేదని, తమ సంతకాలను ఎవరో ఫోర్చరీ చేశారని రాజీనామా చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు చెబుతున్నారు. తాము పార్టీకి రాజీనామా చేయలేదని, పార్టీ వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications