షాకింగ్: ఇడ్లీ తయారీలోనూ ప్లాస్టిక్ వాడకం, 11 కిలోల ప్లాస్టిక్ స్వాధీనం
దేశంలో పలుచోట్ల ప్లాస్టిక్ బియ్యం బైటపడగా.. తాజాగా చెన్నైలోని పలు హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం వెలుగులోకి వచ్చింది.
చెన్నై: దేశంలో పలుచోట్ల ప్లాస్టిక్ బియ్యం బైటపడగా.. తాజాగా చెన్నైలోని పలు హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం వెలుగులోకి వచ్చింది. అన్నానగర్, తేనాంపేట మండలాల్లోని పలు హోటళ్లపై బుధ, గురువారాల్లో ఆహార భద్రతాశాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది.
చెన్నైలో కొన్ని చిన్న, పెద్ద తరహా హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ షీటు ఉపయోగిస్తున్నారంటూ అధికారులకు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా హోటళ్లలో 11 కిలోల ప్లాస్టిక్ షీటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక్క అన్నానగర్ మండలంలోనే 30కి పైగా హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని హోటళ్లలో ఇడ్లీలు ఉడికించే ప్రక్రియలో ప్లాస్టిక్ షీటును వినియోగించడం అధికారుల కంట పడింది. ఆయా హోటళ్ల నుంచి 6 కిలోల ప్లాస్టిక్ పేపర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే తేనాంపేట మండల పరిధిలోని నుంగంబాక్కంలో జరిపిన తనిఖీల్లో 5 కిలోల ప్లాస్టిక్ పేపర్ పట్టుబడింది. నిజానికి ప్లాస్టిక్ పేపర్ తయారీలో కొన్ని రసాయనాలు వినియోగిస్తారని, ఇలాంటి పేపర్ పై ఇడ్లీలు ఉడికిస్తే.. ఆ రసాయనాలు ఇడ్లీలలో కూడా కలిసే ప్రమాదముందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
అన్నానగర్, తేనాంపేట మండలాల్లో ప్లాస్టిక్ పేపర్ స్వాధీనం చేసుకున్న హోటళ్ల యజమానులను హెచ్చరించి వదిలేశామని, ప్రస్తుతానికి కఠిన చర్యలేమీ తీసుకోవడడం లేదని, దీని గురించిన సమాచారం మిగిలిన ప్రాంతాల్లోని హోటళ్ల యజమానులకు కూడా ఇచ్చి వారిలోనూ అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మరో అధికారి పేర్కొన్నారు.
''ప్లాస్టిక్ బియ్యం పట్టుబడితే కఠిన చర్యలు''
మరోవైపు రాష్ట్రంలో ప్లాస్టిక్ బియ్యం పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కామరాజ్ హెచ్చరించారు. చెన్నై సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం చెలామణీ లవుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, అయితే తమిళనాడులో ఇప్పటి వరకు ఇలాంటి బియ్యం కనిపించలేదని అన్నారు.
రేషన్ దుకాణాల ద్వారా సరఫరా అయ్యే బియ్యాన్ని సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని, అనుమానం వచ్చిన చోట బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ బియ్యం పట్టుబడినా, సరఫరా చేసినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications