పట్టాలు తప్పిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్..
లక్నో: దేశంలో వరుస రైలు ప్రమాదాలు సంభవిస్తోన్నాయి. రైల్వే నెట్‌వర్క్‌లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నాయి. మొన్నటికి మొన్న ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించిన ఘటనను విస్మరించకముందే.. అలాంటి ఉదంతమే మరోసారి చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వద్ద సుహైల్‌దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులెవరూ గాయపడలేదు. ట్రాక్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తక్షణ మరమ్మతు పనులు చేపట్టారు.

ఢిల్లీలోని ఆనంద్ విహార్- ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ సిటీ స్టేషన్ల మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇది. సాయంత్రం ఆనంద్ విహార్ నుంచి 6:50 నిమిషాలకు బయలుదేరింది. మరుసటి ఉదయం 9:30 గంటలకు ఘాజీపూర్ సిటీ స్టేషన్ చేరాల్సి ఉంది. మార్గమధ్యలో ప్రయాగ్ రాజ్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పట్టాలు తప్పింది.
స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ఇంజిన్, రెండు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు నెమ్మదిగ్గా వెళ్తోండటం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో ప్లాట్ ఫామ్ నంబర్ 6 ట్రాక్ కొంతమేర దెబ్బతింది. రైల్వే సిబ్బంది తక్షణమే మరమ్మతు పనులు చేపట్టారు.

ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తోన్నామని నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ హిమాంశు శేఖర్ ఉపాధ్యాయ తెలిపారు. కాగా- గ్రీన్ సిగ్నల్ పడటంతో రైలు బయలుదేరింది. కొద్దిసేపటికే అది ఆరిపోవడం వల్ల గందరగోళానికి గురైన లోకోపైలెట్ సడన్‌గా బ్రేకులు వేయడం వల్ల ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయని అనుమానిస్తోన్నారు.












Click it and Unblock the Notifications