థరూర్.. మీ పని ఖతమ్!: సునంద ట్వీట్, చెంపదెబ్బ, ఐపీఎల్‌పై...
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్యకేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోన్న విషయం తెలిసిందే. సునంద మరణించడానికి రెండు మూడు రోజుల ముందు వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిందన్న విషయం ఇప్పటికే థరూర్ పని మనిషి ద్వారా బయటపడింది.
అంతేకాక నీ పని అయిపోయింది థరూర్ సాబ్.. అన్ని విషయాలు మీడియాకు చెప్పేశాననంటూ ఆమె థరూర్‌కు ట్వీట్ చేసిన సంగతి వెల్లడైంది. థరూర్ పని మనిషి నారాయణ్ సింగ్ ఈ సంచలన అంశాలను పోలీసు దర్యాప్తులో బయటపెట్టాడు. హోటల్ గదినుంచి సునంద.. శశిథరూర్‌కి ట్వీట్ చేశారని ఆయన చెప్పాడు.
ఆసమయంలో సునందతో ఆమె స్నేహితుడు సునీల్ ఉన్నాడన్నాడు. ఈ మేరకు సునీల్ ట్రక్రూను కూడా విచారించామని పోలీసులు తెలిపారు. ఐపీఎల్ కోణంలో ఈ విచారణ సాగినట్లు వెల్లడించారు. సునంద తనతో ఐపీఎల్ గురించి మాట్లాడిన విషయం నిజమేనని, అయితే ఆమె ఎలా మరణించిందన్న విషయం తనకు తెలియదని సునీల్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

సునంద మరణానికి రెండు రోజుల ముందు ఢిల్లీ విమానాశ్రయంలోనే శశిథరూర్‌కి, సునందకు గొడవ జరిగిందని సునీల్ తెలిపారు. అతడు పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం.. శశిథరూర్‌తో ఆయన నివాసానికి వెళ్లడానికి సునంద తిరస్కరించారు.
ఈ సందర్భంలో ఆమెను శశిథరూర్ బలవంతపెట్టబోగా ఆయనను సునంద చెంపదెబ్బ కూడా కొట్టారు. ఆ తర్వాత సునీల్‌కు ఫోన్ చేసి అతడి సహాయంతో లీలా ప్యాలస్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ రూం నంబర్ 307లో దిగారు.
ఆమెను శాంతపరచడానికి సునీల్ ప్రయత్నించారు. కాగా సునంద, శశిథరూర్ మధ్య గొడవకు క్యాటీ అనే మహిళ కూడా కారణమని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసు విచారణలో అనేక తప్పులు దొర్లుతున్నాయని సరైన దిశలో విచారణ జరిపించాలని థరూర్ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. మరోవైపు, సునంద మృతి కేసులో శశిథరూర్‌ను ప్రస్తుతానికి ప్రశ్నించమని ఢిల్లీ పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications