సునంద మృతి మిస్టరీ: థరూర్ అసహనం, ఏడ్చేసిందట
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కరణ మరణం మిస్టరీ వీడలేదు. సునంద అనుమానాస్పద మృతిపై దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు ఆమె భర్త, కేంద్రమంత్రి శశిథరూర్, సోదరుడు రాజేష్, జర్నలిస్టు నళిని సింగ్‌ల వాంగ్మూలాల్ని ఆదివారం మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. సునంద మృతి వెనుక ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం సునంద చనిపోయిన హోటల్లో సిసి టివి రికార్డుల్ని పరిశీలించిన తర్వాత థరూర్ ప్రయివేటు సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు.
థరూర్‌తో తన గొడవ గురించి గురువారం రాత్రి తన స్నేహితులతో సునంద మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు వారిని ప్రశ్నించాలని నిర్ణయించారు. జర్నలిస్టు నిళిని సింగ్‌తోనే సునంద చివరిసారిగా మాట్లాడారని భావిస్తున్నారు. సునంద తనతో ఏం మాట్లాడిందో అదే చెప్పానని, ఆమె మనసులో ఏమో పెట్టుకొని మాట్లాడినట్లుగా కనిపించిందని, అదే విషయాన్ని తెలిపానని నళిని చెప్పారు. ఆమె మనోవేధనతో ఉన్నట్లుగా కనిపించిందని, ఏడ్చిందని ఆ తర్వాత తమాయించుకుందని చెప్పారు.

షిండేకు థరూర్ లేఖ
శశిథరూర్ 50 నిమిషాల పాటు దర్యాఫ్తు సంస్థ ఎదుట హాజరై నాటి సంఘటన క్రమాన్ని వివరించారు. మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారమవుతున్న కథనాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా విచారణ చేసి నిజాలు వెలికితీయాలని థరూర్ విజ్ఞప్తి చేశారు. పోలీసు దర్యాఫ్తుకు అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని థరూర్ కేంద్ర హోంమంత్రి షిండేకు లేఖ రాశారు.
ఇద్దరి మధ్య గొడవ
ట్విట్టర్ వివాదంపై సునంద, థరూర్‌లు కలిసి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సునంద ఆరోపణలు చేసిన జనవరి 15న.. వీరిద్దరూ తిరువనంతపురం నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చారు. ప్రయాణం సాగినంత సేపూ వీరి వివాదం కూడా సాగిందని వారి తోటి ప్రయాణికులకు సైతం విషయం అర్థమయ్యేంతగా ఇద్దరూ వాదించుకున్నారని సమాచారం. ఈ తతంగాన్నంతా ముంబైలో అదే విమానంలో ఎక్కిన మనీశ్ తివారీ గమనించారని పలు జాతీయ పత్రికలు పేర్కొన్నాయి.
ఢిల్లీలో విమానం దిగాక కూడా వీరి గొడవ సద్దుమణగకుండా కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో సునంద కన్నీళ్లతో వేగంగా వాష్‌రూమ్‌లోకి వెళ్లిపోయారట. వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం వాష్‌రూమ్ బయట ఉన్న సిసిటివి ఫుటేజీలో నమోదయింది. దీంతో సునంద ఇంటికి వెళ్లకుండా నేరుగా లీలా హోటల్ దిగగా మర్నాడు (జనవరి 16న) థరూర్ కూడా అదే హోటల్‌లో దిగారు. దీంతో ఇద్దరూ ఒకే గదిలోకి మారారు.
హోటల్‌కి వచ్చిన సమయంలో ఆమె చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టు హోటల్ సిబ్బంది గమనించారు. ఆరోజు రాత్రంతా వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తమ్మీద మెహర్ తరార్ విషయమై వారిద్దరి మధ్య ఆర్నెల్లుగా వాదన జరుగుతున్నప్పటికీ సునంద మృతికి మూడు రోజుల ముందు నుంచి ఎడతెగకుండా వాగ్యుద్ధం జరిగిందని.. ఆమె తన చివరి మూడు, నాలుగురోజుల్లో తీవ్ర ఆగ్రహానికి, కుంగుబాటుకు గురయ్యారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం తెల్లవారు జామున నాలుగున్నర దాకా ఇద్దరు వాదులాడుకున్నారని, చివరకు థరూర్ డ్రాయింగ్ రూంలోని సోఫాపై పడుకోగా, ఆమె పడకగదిలోని బెడ్ పై పడుకున్నారట.
దీంతో పోలీసులు ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. థరూర్ ఇంట్లో పని చేసే నారాయణ్ అనే వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం వీరిద్దరి మధ్య గొడవ ఒకదశలో హింసాత్మకంగా కూడా మారినట్టు తెలుస్తోంది. ఆమె మణికట్టు వెనకభాగంలో గాయాలున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పోస్ట్‌మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. హోటల్‌లో ఆమె దిగిన 345 గదిలో అల్‌ప్రాక్స్ ట్యాబ్లెట్ల ఖాళీ షీట్లు పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
మోతాదుకు మించి మందులు
సునంద మద్యం సేవించిన ఆనవాళ్లు లేవని అయితే, మత్తు మందులు మోతాదుకు మించి వాడిన లక్షణాలు ఉన్నాయని ఎయిమ్స్ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications