సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్ధరామయ్యకు అభినందనలు- ఇంటి వద్ద భద్రత
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 136 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది కాంగ్రెస్. 1989 తరువాత ఈ స్థాయి ఓట్ షేర్‌ను కాంగ్రెస్ అందుకోవడం ఇదే తొలిసారి.
భారతీయ జనతా పార్టీ 65 నియోజకవర్గాలకే పరిమితమైంది. 118 నుంచి 65 స్థానాలకు పడిపోయింది బీజేపీ సంఖ్యాబలం. ఈ పార్టీకి లభించిన ఓట్ల శాతం 35.9. ఈ ఓటమి అనంతరం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సారథ్యంలోని కేబినెట్‌లో 11 మంది మంత్రులు ఓడిపోవడం బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టింది. జనతాదళ్ (సెక్యులర్)-19, ఇతరులు-4 స్థానాల్లో గెలిచారు.

కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవ్వాళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఈ భేటీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారకులైన డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

పార్టీని అధికారంలోకి తీసుకుని రావడంలో ఇద్దరూ శక్తివంచన లేకుండా పని చేసిన నేపథ్యంలో- సమన్యాయం చేయాలనే ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. అయిదు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోవాల్సి ఉంటుందనే ఫార్ములా కాంగ్రెస్ అధిష్ఠానం అనుసరించవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ సాయంత్రం జరిగే సీఎల్పీ భేటీలో దీన్ని ఖాయం చేసే అవకాశాలు ఉన్నాయి.
#WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs
— ANI (@ANI) May 14, 2023
ఈ పరిణామాల మధ్య సిద్ధరామయ్య అభిమానులు అప్రమత్తం అయ్యారు. తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. బెంగళూరులోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటోన్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్ధరామయ్యకు హృదయపూర్వక అభినందనలు అంటూ బ్యానర్లు కట్టారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తోన్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications