డిజిటల్ అరెస్టులపై సుప్రీం సీరియస్..! 3 వేల కోట్లు కొట్టేయడంపై..!
దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టుల వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టుల పేరుతో ఇప్పటివరకూ సైబర్ నేరస్తులు పేదలు, వృద్ధుల నుంచి 3 వేల కోట్లు కొట్టేయడంపై మండిపడింది. సైబర్ నేరస్తుల్ని ఉక్కు పిడికిలితో ఎదుర్కొనేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. డిజిటల్ అరెస్టుల వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
డిజిటల్ అరెస్టుల పేరుతో దేశంలో 3 వేల కోట్ల స్కాం జరగడంపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చర్యలకు సిఫార్సులు చేసేందుకు అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా సీనియర్ న్యాయవాది ఎన్ఎస్ నప్పినాయ్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేస్తే, తీవ్ర నిర్ణయాలు ప్రకటించకపోతే సమస్య మరింత పెద్దవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

డిజిటల్ అరెస్టులపై వాదనలు వినిపించేందుకు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా .. ఈ స్కాంలో బాధితులు ఎక్కువగా వృద్ధులు కావడం బాధాకరమని తెలిపారు. ఇలాంటి కేసుల్ని ఎదుర్కొనేందుకు హోంశాఖలో ఓ ప్రత్యేక విభాగం ఉందని, సమయం ఇస్తే కోర్టుకు పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం డొమైన్ నిపుణులకు ఉండవచ్చని కోర్టు తెలిపింది. ఇది చాలా పెద్ద సవాలు అని, చాలా షాకింగ్ విషయమని తెలిపింది.

ఇతర దేశాలలో ఏం జరుగుతుందో తమకు తెలియదని, సాంకేతిక, ఆర్థిక స్తంభాలు ఎలా పనిచేస్తున్నాయో తెలియదని న్యాయమూర్తి తెలిపారు. అయితే వాటి సామర్థ్యాలను మనం మాత్రం బలోపేతం చేసుకోవాలన్నారు. మనం తడబడితే లేదా విస్మరిస్తే, కఠినమైన ఆదేశాలు జారీ చేయకపోతే, సమస్య మరింత తీవ్రమవుతుందని తెలిపారు. హోం శాఖ నుండి అందిన సీల్డ్ నివేదిక ఆధారంగా తన కార్యాలయం ఒక సంక్షిప్త నివేదికను రూపొందించిందని, కొన్ని ఉపయోగకరమైన సూచనలు వచ్చాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. నవంబర్ 10న సంక్షిప్త విచారణ తర్వాత దీనిపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications