Supreme Court: యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court: యూట్యూబ్ లో వస్తున్న అశ్లీల కంటెంట్ పై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. యూట్యూబ్ లో అశ్లీల కంటెంట్ నియంత్రణ లేకపోవడంతో యూట్యూబర్లు దుర్వినియోగం చేస్తున్నారని గమనించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వంపైనా సీరియస్ అయింది. అశ్లీల కంటెంట్ ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. రణవీర్ అల్హాబాదియా 'ఇండియాస్ గాట్ లాటెంట్' వివాదం నేపథ్యంలో విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసు జారీ చేసి.. యూట్యూబ్ లో ఆన్ లైన్ కంటెంట్ ను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలా జరగడం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబర్లు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నారని.. కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడింది.
ఈ సందర్భంగా 'ఇండియాస్ గాట్ లాటెంట్' కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భావప్రకటనా స్వేచ్ఛతో పాటు పాపులారిటీ ఉంటే ఏదైనా ఏదైనా మాట్లాడుతారా?.. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఏది పడితే అది మాట్లాడడానికి మీకు లైసెన్స్ ఉందా అంటూ ప్రశ్నించింది. ఇలాంటి వ్యక్తులకు ఎందుకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహించింది. ఇక ఈ వ్యవహారంలో మరో పోలీసు కేసు నమోదు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణవీర్ అల్హాబాదియాను హెచ్చరించిందని. యూట్యూబర్ తన పాస్ పోర్టును థానే పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి షోలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

వివాదం ఏమిటి?
ఇటీవల యూట్యూబ్ షోలో ఓ వ్యక్తిని అడుగుతూ రణవీర్ అల్హాబాదియా ఓ చెత్త జోక్ చేసిన తర్వాత పెద్ద వివాదం చెలరేగింది. అల్హాబాదియా వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అల్హాబాదియా వ్యాఖ్యలపై పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్.. అన్నింటిని క్లబ్ చేయాలని ఓ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆ పిటిషన్ పై తాజాగా విచారణ జరిగింది.












Click it and Unblock the Notifications