టీవీకే ఎమ్మెల్యేకు సుప్రీంలో భారీ ఊరట
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే.. అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గింది. అనుకున్నదాని కంటే భారీ మద్దతు లభించింది. ఏఐఏడీఎంకే చీలికవర్గం మొత్తం కూడా ప్రభుత్వానికి అండగా నిలిచింది. 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 118 కాగా.. ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా టీవీకేకు 144 మంది సభ్యులు మద్దతు పలికారు. దీంతో టీవీకే తన సంపూర్ణ బలాన్ని నిరూపించుకున్నట్టయింది అసెంబ్లీలో.
కాగా.. టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి బలపరీక్షలో ఓటు వేయకుండా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మొన్నటి ఎన్నికల్లో తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి ఒక్క ఓటు తేడాతో గెలిచారాయన. సేతుపతి విజయాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి కేఆర్ పెరియకరుప్పన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో సేతుపతి ఓటు వేసేందుకు మార్గం సుగమమైంది.

ఈ వివాదం.. సేతుపతి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్‌ను ఒకే ఓటు తేడాతో ఓడించడంతో మొదలైంది. పెరియకరుప్పన్‌కు అనుకూలమైన ఓ పోస్టల్ బ్యాలెట్ పొరపాటున వేరే నియోజకవర్గానికి చేరి, లెక్కించలేదని డీఎంకే ఆరోపించింది. వివాదం పెండింగ్‌లో ఉండగా సేతుపతి ఓటు వేస్తే అది ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఆయనను ట్రస్ట్ ఓటింగ్‌లో నిరోధించింది.
మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీనివాస సేతుపతి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అభిషేక్ మను సింఘ్వీ హైకోర్టు తీర్పు తప్పని వాదించారు. డీఎంకే తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ తన వాదనలను వినిపించారు. ఎన్నికల ఫలితాన్ని ఆర్టికల్ 226 ప్రకారం రిట్ పిటిషన్‌తో ఎలా సవాలు చేస్తారని బెంచ్ నిలదీసింది. ఎన్నికల పిటిషన్ మాత్రమే దీనికి సరైన మార్గమని స్పష్టం చేసింది.
పెరియకరుప్పన్‌కు అనుకూలమైన పోస్టల్ బ్యాలెట్ పొరపాటున మరొక నియోజకవర్గం నుంచి వచ్చిందని ముకుల్ రోహత్గీ చెప్పారు. ఆ బ్యాలెట్ లెక్కించి ఉంటే ఫలితం టై అయ్యేదని రోహత్గీ పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు.. రోహత్గీకి కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు అవకాశం ఇస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.












Click it and Unblock the Notifications