Rahul Gandhi: రాహుల్ గాంధీ పిటిషన్‍పై తీర్పు రిజర్వ్ చేసిన సురత్ సెషన్స్ కోర్టు..
పరువు నష్టం కేసులో తనకు విధంచిన శిక్షపై స్టే విధించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ పై ఏప్రిల్ 20 తమ తీర్పు చెబుతామని సురత్ సెషన్స్ కోర్టు గురువారం తెలిపింది. రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్‌ఎస్ చీమా వాదనలు వినిపించారు. రాహుల్ వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికయ్యారని, తీర్పుతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవడం పెద్ద నష్టమని కోర్టు తెలిపారు. రాహుల్ ప్రసంగం పరువు నష్టం కలిగేలా లేదని, దాన్ని అలా చిత్రీకరించారని వివరించారు.
వాస్తవానికి ప్రధానిపై బహిరంగంగ వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు వాదించారు. 'పంజాబీలు గొడవలు చేస్తారని ఎవరైనా చెబితే.. దానిపై పరువు నష్టం కేసు పెట్టొచ్చా' అని ప్రశ్నించారు. సందర్భాన్ని బట్టి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని, మోదీ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులను అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశం ఉందా? లేదా? నిర్ధారించాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

రాహుల్ వ్యాఖ్యలు ఎవరి పరువుకు భంగం కలిగేలా లేవని, కేవలం భూతద్దంలో చూపిస్తూ కేసు వేశారని ఆరోపించారు. గుజరాత్ జనాభా మొత్తం ఆరుకోట్లని, మోదీ ఇంటిపేరుతో 13కోట్ల మంది ఉన్నారంటూ పిటిషనర్ లాజిక్‌ను న్యాయవాది చీమా ప్రశ్నించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న అదనపు సెషన్స్ జడ్జి ఆర్‌పీ మొగేరా ఏప్రిల్ 20న ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ 2019లో ఎన్నికల ర్యాలీలో చేసిన "దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది" అన్నందుకు కాంగ్రెస్ నాయకుడిని దోషిగా నిర్ధారిస్తూ మార్చి 23న సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు అమలును నెల రోజుల పాటు నిలిపివేసింది. దోషిగా నిర్ధారించిన తర్వాత పార్లమెంటు సెక్రటెరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది.
ఈ తీర్పుపై సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ చేశారు. ఈలోగా శిక్షను నిలిపి వేయాలని కోరాడు. మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలుస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బుధవారం ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications