తెలంగాణ బిల్లుపై అంతే: సీమాంధ్ర నేతలకు రిప్లై

అసెంబ్లీలో బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టి, అక్కడ చర్చ జరిగే సమయానికి మొత్తం వివరాలను పార్లమెంటుకే సమర్పిస్తామని స్పష్టం చేసింది. విభజనపై అసెంబ్లీలో చర్చించేందుకు ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే వివరాలను బిల్లులో ప్రస్తావించామని, ఇతర అంశాలపై పార్లమెంటులోనే చర్చ జరుగుతుందని స్పష్టం చేస్తూ మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ అందినట్లు తెలిసింది.
బిల్లులో వివరాలు లేవని, ఆర్థిక అంశాలులేవని, బిల్లు అసమగ్రంగా ఉందని, పూర్తి వివరాలు అందిస్తేనే శాసనసభలో చర్చకు వీలవుతుందని సీమాంధ్ర శాసనసభ్యులు కొందరు వాదిస్తున్న విషయం తెలిసిందే.
కొంతమంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖలు కూడా రాశారు. ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ముందు ఉంచినప్పుడు కూడా ఆర్థిక మెమోరాండం, ఉద్దేశాలు, కారణాలు అనే అంశాలను జోడించలేదని తెలిసింది. ఇవన్నీ పార్లమెంటుకు నివేదిస్తారని, శాసనసభ అభిప్రాయాన్ని కూడా సభ ముందుంచుతారని అధికార వర్గాలు తెలిపాయి.
గతంలో మూడు రాష్ట్రాల విభజన బిల్లు విషయంలోనూ ఇదే జరిగిందని పేర్కొన్నాయి. కొత్త రాజధాని, ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల నిర్మాణం, పోలవరం వంటి ప్యాకేజీలకు పార్లమెంటులోనే చెబుతామని అధికారవర్గాలు స్పష్టం చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications