ప్రధాని రేసులో నీలేకనీ!: వదంతని కొట్టిపారేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ ప్రధానమంత్రి అభ్యర్థి నందన్ నీలేకనీ అనేది కేవలం వదంతి మాత్రమేనని, అభ్యర్థి ఎవరనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, అది రాహుల్ గాంధీయా లేక మరొకరా అనేది అధిష్టానం త్వరలో నిర్ణయిస్తుందని కాంగ్రెసు పార్టీ బుధవారం పేర్కొంది.
పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ విలేకరులతో మాట్లాడారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కాబోయే ప్రధాని అభ్యర్థి నందన్ నీలేకని అనేది వదంతి మాత్రమేనని కొట్టిపారేశారు. పార్టీలో రాహుల్ గాంధీకి పార్టీలో అందరూ మద్దతిస్తున్నారని, ఆయన కాకపోతే మరెవరు ప్రధాని అభ్యర్థి అవుతారని ప్రశ్నించారు.

అదే సమయంలో మన్మోహన్ సింగ్ స్థానంలో మరొకరు ప్రధానిగా సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటారనే ప్రచారాన్ని కూడా ఆయన కొట్టి పారేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా పూర్తి కాలం కొనసాగుతారని చెప్పారు.
ఇలాంటి నిరాధార వార్తలు ఎందుకు, ఎక్కడి నుండి వస్తాయో తెలియడం లేదన్నారు. ప్రధాని అభ్యర్థిని తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సరైన సమయంలో ప్రకటిస్తారన్నారు.
కాగా, ప్రధాని అభ్యర్థి రేసులో నందన్ నీలేకనీ కూడా ఉన్నారంటూ ఓ వార్తాపత్రిక కథనం పేర్కొంది. అయితే, 'ఇంతకన్నా చెత్తవార్త మరొకటి ఉండదు' అని సాక్షాత్తూ ఆయనే ఖండించినట్లు కూడా పేర్కొంది. దీనిపై కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ "మాకు మా పార్టీ నేతలున్నారు. నీలేకనీ కూడా మాతో పనిచేస్తున్నార''ని చెప్పారు.
ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమేనని బిజెపి నేత యశ్వంత్ సిన్హా అన్నారు. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహార'మని సమాజ్‌వాది అధినేత ములాయం చెప్పారు. అదే పార్టీకి చెందిన రామ్‌గోపాల్ యాదవ్‌తోపాటు జెడియూ నాయకుడు శివానంద్ తివారీ కూడా 'ఎవరీ నిలేకని?' అని ప్రశ్నించడం గమనార్హం.












Click it and Unblock the Notifications