విజయ్ ఒక్క సంతకంతో..: రూ.5,932 కోట్ల రైతు రుణమాఫీ
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది రైతులకు లబ్ధి చేకూర్చింది. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతుల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్ని వెలువరించింది. కొద్దిసేపటి కిందటే ఆదేశాలు విడుదల అయ్యాయి.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 14,43,504 మంది రైతులకు లబ్ది కలిగినట్టయింది. 5,932.23 కోట్ల రూపాయల మేర రుణాల నుండి విముక్తి కలగనుంది. ప్రతీ రైతుకూ ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిబంధనల ప్రకారం, రుణం తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.75,000ల పరిమితి వరకు పూర్తి అంటే 100 శాతం రుణమాఫీ లభిస్తుంది. ఒకవేళ తీసుకున్న రుణం మొత్తం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే, వారికి గరిష్టంగా రూ.35,000ల వరకు రుణమాఫీ వర్తింపజేస్తారు. దీని ద్వారా గత ఏడాది కాలంలో పంట రుణాలు తీసుకున్న వారందరికీ కనీసం రూ.35,000 నుండి గరిష్టంగా రూ.75,000ల వరకు పరోక్ష సహాయం చేకూరనుంది.
లబ్ధిదారులను వారి భూకమతాల ఆధారంగా చిన్న, సన్నకారు, ఇతర పెద్ద రైతులుగా వర్గీకరించారు. ఇందులో అత్యధికంగా ప్రయోజనం పొందింది చిన్న, సన్నాకారు రైతులే కావడం విశేషం. మొత్తం 8,33,773 మంది రైతులు ఈ కేటగిరీలో ఉన్నారు. వారికి రూ.3,599.67 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. వ్యవసాయంపైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న ఈ సాధారణ రైతు కుటుంబాలకు ఈ నిర్ణయంతో చాలా పెద్ద ఉపశమనం లభించింది.
చిన్నకారు రైతుల విభాగంలో కూడా భారీ సంఖ్యలో లబ్ధిదారులు ఈ పథకంలో చోటు దక్కించుకున్నారు. మొత్తం 5,16,183 మంది చిన్నకారు రైతులకు చెందిన రూ.1,995.42 కోట్ల రుణాలను ప్రభుత్వం రద్దు చేసింది. వీరితో పాటు 93,548 మంది ఇతర పెద్ద రైతులకు సైతం రూ.337.15 కోట్ల మేర పంట రుణాల ఉపశమనం కల్పించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని వర్గాల రైతులకు మేలు కలిగించినట్టయింది.
సహకార సంఘాల ద్వారా అందిన ఈ భారీ రుణ ఉపశమనం.. రాబోయే నూతన పంటల సాగు కాలానికి సిద్ధమవుతున్న రైతులకు ఎంతగానో తోడ్పడనుంది. రుణాల భారం పూర్తిగా తొలగిపోవడంతో, రైతులు ఎటువంటి ఆందోళనలు లేకుండా కొత్త పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర యంత్ర సామగ్రిని సమకూర్చుకోగలుగుతారు. సహకార బ్యాంకుల నుండి నూతన పంట రుణాలు పొందేందుకు కూడా వీరికి అవకాశం లబించినట్టయింది.












Click it and Unblock the Notifications