నేరుగా ఇంటికే మద్యం పంపిణీ: పెళ్లిళ్లల్లోనూ మందు తాగొచ్చు: స్పెషల్ లైసెన్స్ జారీ
చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం.. మద్యం అమ్మకాలకు గేట్లు ఎత్తి వేసింది. ఆదాయార్జనపై దృష్టి సారించింది. మద్యం అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా లిక్కర్ సేల్స్‌ను మరింత పెంచింది. ఈ దిశగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
తమిళనాడులో మద్యం అమ్మకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. దీనికోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)పేరుతో ఓ సంస్థనే నెలకొల్పింది. ప్రైవేటు కంపెనీలు, బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సహా అన్ని రకాల మద్యం టస్మాక్ అవుట్‌లెట్స్‌లల్లో లభిస్తాయి.

2022-2023 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా మాత్రమే 45,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది తమిళనాడు ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 50,000 కోట్ల రూపాయలకు చేరొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ నేపథ్యంలో- లక్ష్యాన్ని అందుకోవడానికి తొలి త్రైమాసికంలోనే పెద్ద ఎత్తున కసరత్తు మొదలు పెట్టింది.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలకు గేట్లు ఎత్తేసింది. పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాల్లో మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతులను మంజూరు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా లైసెన్స్‌ను తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశించింది. వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టాలిన్ సర్కార్.
ఆయా ప్రదేశాల్లో మద్యాన్ని విక్రయించాలంటే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు- మున్సిపల్ కార్పొరేషన్లల్లో 1,00,000 రూపాయలుగా నిర్ధారించింది. మున్సిపాలిటీల్లో 75,000 రూపాయలు, పంచాయతీలు- ఇతర ప్రాంతాల్లో 50,000 రూపాయలను కట్టాల్సి ఉంటుంది. ఇది వార్షిక ఫీజు. ఒక రోజు కోసం లిక్కర్ విక్రయాలు, మద్యం సేవించడానికీ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది.

సాధారణంగా- కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ అండ్ ఫంక్షన్ హాల్స్‌లల్లో ఒకరోజుకు మించి సదస్సులు, సమావేశాలు, వివాహ వేడుకలు జరగవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపొందించింది. ఒక్కరోజు కోసం మద్యాన్ని సేవించడానికి, వాటిని విక్రయించుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్లల్లో 11,000 రూపాయలను రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాలి.
మున్సిపాలిటీల పరిధిలో ఉండే కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ అండ్ ఫంక్షన్ హాల్స్‌లల్లో మద్యాన్ని సేవించాలంటే 7,500 రూపాయలు, పంచాయతీలు, ఇతర ప్రాంతాల్లో 5,000 రూపాయలను కట్టాలి. నాన్ కమర్షియల్ ప్రదేశాలు అంటే ఇళ్లల్లో జరిగే వివాహాది శుభకార్యాలకు ప్రభుత్వమే మద్యాన్ని నేరుగా సరఫరా చేస్తుంది. దీనికీ ఇదే రిజిస్ట్రేషన్ ఫీజు వర్తింపజేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్‌ను జారీ చేసింది.












Click it and Unblock the Notifications